హెచ్-1బీతో పాటు ఇతర వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల కనీస వేతనాలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన చివరి రోజుల్లో నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థలు.. అగ్రరాజ్య ప్రజలను పక్కనపెట్టి తక్కువ జీతాలతో విదేశీయులను నియమించుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టింది.
ఈ నిబంధన.. అమెరికన్ల ఉద్యోగాలు, జీతాలను రక్షిస్తాయని అగ్రరాజ్య కార్మికశాఖ పేర్కొంది. ఇప్పుడున్న వేతనాల పద్ధతిలో సంస్కరణలు చేపట్టి.. హెచ్-1బీ, హెచ్-1బీ1, ఈ-3తో పాటు శాశ్వత ఉపాధి ధ్రువీకరణ కార్యక్రమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చని స్పష్టం చేసింది. తోటి అమెరికా ఉద్యోగికి సమానంగా విదేశీయులకు వేతనాలు అందించే విషయంలో మరింత ఖచ్చితత్వాన్ని ఈ తుది నిబంధన తీసుకొస్తుందని కార్మికశాఖ అభిప్రాయపడింది.