తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయులకు మరింత సులభంగా గ్రీన్​కార్డ్​! - భారతీయులు

భారతీయులకు శుభవార్త. నైపుణ్యం ఉన్న వారికే పెద్దపీట వేస్తూ.. అమెరికా ఇమిగ్రేషన్​లో నూతన విధి విధానాలను ప్రకటించారు ట్రంప్. ఇప్పటి వరకు నైపుణ్య పరంగా గ్రీన్​ కార్డు పొందడానికి ఉన్న 12 శాతాన్ని, 57 శాతానికి పెంచారు. ఆంగ్లభాషపై పట్టు, అగ్రరాజ్య చరిత్రపై కనీస అవగాహన తప్పనిసరి చేశారు. ట్రంప్​ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వేల మంది భారతీయులు లబ్ధిపొందుతారు.

భారతీయులకు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం శుభవార్త

By

Published : May 17, 2019, 5:03 AM IST

Updated : May 17, 2019, 9:51 AM IST

12శాతం కాదు... 57శాతం

అమెరికాకు వలసలకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నూతన విధి విధానాలనుప్రకటించారు. నైపుణ్యం ఉన్న వారే గ్రీన్​కార్డును పొందేలా చర్యలు చేపట్టారు. నైపుణ్యం పరంగా గ్రీన్​ కార్డు పొందడానికి ప్రస్తుతం ఉన్న 12 శాతం కోటాను భారీగా 57 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోటాను మరింత పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

"ప్రస్తుత వ్యవస్థ వల్ల నైపుణ్యం ఉన్న వారికి అమెరికా ప్రాధాన్యత ఇవ్వలేకపోతోంది. ప్రతిభ చాటిన డాక్టర్లు, పరిశోధకులు, మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులను పట్టించుకోవట్లేదు. నైపుణ్యం ఆధారంగా కేవలం 12శాతం వలసదారులే ఎంపికవుతున్నారు. ఇదే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ సహా మరిన్ని దేశాల్లో అయితే 60 నుంచి 75శాతం ఉంటుంది. ఇది అతి పెద్ద మార్పు. ఇప్పటి వరకు 12 శాతం మంది మాత్రమే నైపుణ్యం ఆధారంగా గ్రీన్​ కార్డు పొందారు. ఇప్పుడు దాన్ని 57 శాతానికి పెంచుతున్నాం."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఆంగ్ల భాష- అమెరికా చరిత్ర...

ప్రతిపాదించిన నూతన విధి విధానాల్లో ఆంగ్ల భాషకు పెద్దపీట వేసింది ట్రంప్​ ప్రభుత్వం. ప్రవేశానికి ముందు కచ్చితంగా ఆంగ్ల భాష నేర్చుకుని సివిక్స్​ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అగ్రరాజ్య చరిత్రపై కనీస అవగాహన అవసరం.

భారతీయులకు శుభవార్త...

ఇప్పటివరకు గ్రీన్​కార్డు పొందుతున్న వారిలో 66శాతం మంది అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఉన్నవారి బంధువులే కావటం గమనార్హం. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ.. నూతన విధానాలను ప్రకటించారు ట్రంప్​. ప్రస్తుతం 12శాతం మాత్రమే తమ నైపుణ్యంతో గ్రీన్​ కార్డు పొందుతున్నారు. ఈ విధానం వల్ల వేల మంది భారతీయులకు నిరాశే ఎదురవుతోంది. హెచ్​1బీ వీసా ఉన్న భారతీయులు గ్రీన్​కార్డ్​ కోసం సగటున దశాబ్ద కాలం వేచి చూడాల్సి పరిస్థితి నెలకొంది. ట్రంప్​ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వేల మంది భారతీయులు లబ్ధిపొందుతారు.

ప్రతిపాదన గట్టెక్కేనా?

ట్రంప్​ ప్రభుత్వం ప్రకటించిన నూతన ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే చట్టసభ సభ్యుల ఆమోదం అవసరం. రిపబ్లికన్లు అధ్యక్షుడి నిర్ణయంతో సుముఖంగా ఉన్నప్పటికీ... ప్రతిపక్ష డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారా? అన్నదే ప్రధాన ప్రశ్న.
అమెరికా ప్రస్తుతం ప్రతి సంవత్సరం 11 లక్షల గ్రీన్​కార్డులు మంజూరు చేస్తోంది. ట్రంప్​ నిర్ణయం అమల్లోకి వస్తే అందులో సగం మందికిపైగా నైపుణ్యం ఉన్న వారే గ్రీన్​కార్డును పొందుతారు.

ఇదీ చూడండి:'నన్నే జైలుకు పంపుతానని దీదీ బెదిరింపు'

Last Updated : May 17, 2019, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details