తెలంగాణ

telangana

ETV Bharat / international

పెద్దలను బతికించుకునేందుకు అడవిబిడ్డల పోరాటం! - telugu news about corona

అడవి తల్లి ఒడిలో ఒదిగిపోయిన వారికి ప్రకృతే ప్రపంచం. ఏ గ్రంథాల, చరిత్ర పుటలూ వారికి తెలీదు. అసలు వారి భాషకు లిపి అన్నదే లేదు. అయినా, ఆనందమైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడుపుతున్నారంటే అందుకు కారణం తరతరాలుగా వారి పెద్దల మాటను వేదంగా పాటించడమే. అందుకే అమెజాన్​లో అడవి బిడ్డలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. పెను ప్రమాదం నుంచి పెద్దల ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

tribes in amazon forest struggling to save their ancients due to corona virus pandemic
పెద్దలను బతికించుకునేందుకు అడవిబిడ్డల పోరాటం!

By

Published : May 18, 2020, 7:37 AM IST

కరోనా మహమ్మారి.. లాటిన్‌ అమెరికాలోని ఆటవిక తెగలకు అస్తిత్వ పోరు తెచ్చింది. అబేధ్యమైన అమెజాన్‌ అడవిలో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ నుంచి తప్పించుకొనేందుకు వారు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొంటున్నారు. తెగల్లోని వృద్ధులను కాపాడుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. లాటిన్‌ అమెరికాలో అటవీ తెగల జనాభా 4.2 కోట్లు. అక్కడి జనాభాలో ఇది 8 శాతం. ఇప్పటికే చట్టవ్యతిరేకంగా జరుగుతున్న మైనింగ్‌, చమురు వెలికితీత, అడవుల నరికివేత వంటి కార్యకలాపాలతో వారి జీవన విధానానికి ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు వైరస్‌ రూపంలో ఉపద్రవం వచ్చింది.

పెద్దలే చరిత్ర, సంస్కృతి

ఆటవిక తెగల జీవనశైలి, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏవీ లిఖితంగా ఉండవు. పెద్దల ద్వారానే అవి తర్వాతి తరాలకు అబ్బుతుంటాయి. వారసత్వ పరిజ్ఞానం, సంప్రదాయ వేడుకల నిర్వహణ వంటివన్నీ పెద్దల సూచనల ప్రకారమే నడుస్తుంటాయి. సంప్రదాయ వైద్యం, ఔషధాల గురించి విశేషమైన పరిజ్ఞానం వారి సొంతం. ఆచారాలు, భాషల పరిరక్షకులూ వారే. కరోనా వైరస్‌ కారణంగా అలాంటి వృద్ధులే లేకుండా పోతే తమ అస్తిత్వమే పోతుందన్న ఆందోళన ఆ తెగల్లో నెలకొంది. అమెజాన్‌ అడవిలో 35 వేల మంది ఉన్న యనోమామి తెగలో ఏప్రిల్‌ 9న ఓ బాలుడు కరోనాతో మృతిచెందాడు. ఈ ఘటనతో అడవి అంతా భయం పట్టుకుంది. అడవుల్లోకి అక్రమంగా వచ్చేవారితోనే వైరస్‌ వచ్చిందని భావిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం అటవీ సమూహాలలో వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అదే సమయంలో లాక్‌డౌన్‌లతో గిరిజనులు తమ ఉత్పత్తుల్ని మార్కెట్లకు తరలించే అవకాశం లేక ఆర్థికంగానూ చితికిపోయారు.

అంటువ్యాధుల ముప్పు ఎక్కువ

అటవీవాసులకు కొత్త వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. అమెజాన్‌లోని తెగలు తరచూ అంటువ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ సమూహాల జీవనశైలి వేటికవే భిన్నంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ స్వభావం కూడా వేరుగా ఉంటుంది. కొత్త అంటువ్యాధి సోకినప్పుడు వారి ప్రతిస్పందనా వేర్వేరుగా ఉంటుంది. సమూహాలుగా నివసిస్తూ, ఆహారాన్ని పంచుకొని తినే వీరిలో ఏ ఒక్కరికి వైరస్‌ సోకినా మొత్తం తెగ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. గతంలో మశూచి, తట్టు వంటి వ్యాధులు ప్రబలినప్పుడు అర్జెంటీనా, బ్రెజిల్‌లోని కొన్ని తెగల్లో దాదాపుగా సగం మంది తుడిచిపెట్టుకుపోయారు. అమెరికాలోని అసలుసిసలు స్థానికుల్లో 90 శాతం మంది.. వలసదారులతో వచ్చిన అంటువ్యాధులతోనే మరణించారని ఓ అంచనా.

వనరులపైనే ప్రభుత్వాల దృష్టి

లాటిన్‌ అమెరికా దేశాల ప్రభుత్వాలేవీ ప్రస్తుత విపత్తు నుంచి దేశీయ తెగలను కాపాడాలన్న శ్రద్ధ చూపడం లేదు. 9 దేశాల్లో విస్తరించిన అమెజాన్‌ అడవుల్లో మైనింగ్‌, చమురు తవ్వకం, వ్యవసాయ వాణిజ్యాలకు ప్రభుత్వాల పరోక్ష మద్దతు ఉంది. ఇక బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సోనారో అయితే పర్యావరణ పరిరక్షణ విధానాలను తుంగలో తొక్కడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మించిపోయారు. అమెజాన్‌లో మైనింగ్‌కు తలుపులు బార్లా తెరిచేలా బోల్సోనారో ప్రణాళికలు చేస్తున్నారని, ఈ క్రమంలో అటవీ తెగలపై విష ప్రచారం చేస్తున్నారంటూ దేశీయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ‘ప్రభుత్వాల దృష్టి ఎప్పుడు మా అడవిపైనే ఉంటుంది. వారి విధ్వంసక చర్యలకు మమ్మల్ని ఓ అవాంతరంగా చూస్తుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ నుంచి కాపాడతారని ఎలా ఆశించగలం’ అని అమెజాన్‌లోని ఓ తెగ నాయకుడు నెమోంటే చెప్పారు. వ్యాధి సోకితే కనీసం వైద్యం అందించే ఏర్పాట్లైనా చేయడం లేదన్నారు. ఈక్వెడార్‌లో గిరిపుత్రుల వైద్య సేవల్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని అక్కడి పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెరూ, కొలంబియా, వెనెజువెలా, బొలీవియా, గయానాలోనూ ఇదే పరిస్థితి. ఇదే అవకాశంగా అడవుల ఆక్రమణదారులు చొచ్చుకెళ్తున్నారు.

స్వీయ రక్షణ చర్యలు

ప్రభుత్వాలు పట్టించుకోకున్నా కొన్ని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు, పౌరహక్కుల సంఘాలు అటవీపుత్రులకు అండగా నిలుస్తున్నాయి. మహమ్మారి ముప్పుపై అమెజాన్‌ అంతటా విస్తృత ప్రచారం చేశాయి. అప్రమత్తమైన కొన్ని తెగలు ఆహారం, నిత్యావసరాలు సమకూర్చుకుని స్వీయ నిర్బంధాలు పాటిస్తున్నాయి. అర్జెంటీనాలోని పెటగోనియా, బ్రెజిల్‌లోని అమెజాన్‌, కొలంబియాలోని ఆండియన్‌ ప్రాంతాల్లోకి బయటివారెవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. కొలంబియాలోని నరినో ఫ్రావిన్స్‌లో పాస్టో తెగ వారు క్వారంటైన్‌ నియమాలను కఠినంగా అమలుచేస్తున్నారు. సాధ్యమైనంత వరకు దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోతున్నారు. కొందరు తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో గడుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details