ట్రంప్ హయంలో అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్య వ్యవహారాలు సవ్యంగా సాగలేదు. పన్నులపై విభేదాలు ఉండడంమే ఇందుకు కారణం. కాంగ్రెసినల్ రీసెర్చి సర్వీస్ వెలువరించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. సెల్‌ఫోన్, ఇతర టెలికాం పరికరాలపై గతంలో భారత్ ఎలాంటి పన్నులు విధించకపోగా, ఇప్పుడు 15-20శాతం పన్నులు వేస్తోందని ఉదాహరణగా చూపింది. వ్యవసాయ ఉత్పత్తులపై అత్యధికంగా పన్ను వేస్తోందని, వీటిని తరుచూ పెంచుతుండడంతో ఎగుమతిదార్లకు ఇబ్బందికరంగా మారిందని తెలిపింది. దాంతో పలు సందర్భాల్లో ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేసింది.
'ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య విభేదాలు'
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో భారత్‌తో వాణిజ్య విభేదాలు ఎక్కువగా వెలుగు చూశాయని ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు దిగుమతులపై ఎక్కువ మొత్తంలో పన్ను విధిస్తుండడమే కారణం అని పేర్కొంది.
ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై 10శాతం, పన్ను విధించడాన్ని భారత్ కూడా వ్యతిరేకించిందని తెలిపింది. వాణిజ్య ప్రాధాన్య కార్యక్రమం నుంచి భారత్‌ను తప్పించడంతో దానికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులను 10శాతం నుంచి 25శాతానికి పెంచిందని పేర్కొంది. ఈ విభేదాల కారణంగానే ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కుదరలేదని అభిప్రాయపడింది. రక్షణ ఉత్పత్తుల కొనుగోలుపై భారత్ ఆసక్తి చూపుతుండడాన్ని ప్రస్తావించింది. భారత్ వాయుసేన కోసం రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేస్తే అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపింది.