పంజాబ్ బ్యాంకు కుంభకోణం కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని డొమినికా పోలీసులు కిడ్నాప్ చేశారనడాన్ని ఆ దేశ ప్రధాని రూజ్‌వెల్డ్ స్కిర్రిట్ కొట్టిపారేశారు. ఇవన్నీ అర్థంలేని ఆరోపణలన్నారు. ఇటీవల ఆంటిగ్వా నుంచి కనిపించకుండా పోయిన ఛోక్సీ.. డొమినికా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం ఆయన డొమినికా జైలులో ఉన్నారు. దీనిపై స్కిర్రిట్ మాట్లాడుతూ.. "ఛోక్సీ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరాం. అయితే ఆయన హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకుంటాం" అని అన్నారు.
భారత్, డొమినికా కలిసి ఛోక్సీని ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారన్న వాదనలను స్కిర్రిట్ కొట్టి పారేశారు. ఛోక్సీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం అటు భారత్‌కు గానీ, ఇటు ఆంటిగ్వా, డొమినికాకు కూడా లేదన్నారు. దేశాభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో అసలు తల దూర్చబోమని స్పష్టం చేశారు. "ఈ దేశంలో ఎవర్నో హత్యచేసి పక్కదేశానికి పారిపోయి హాయిగా బతుకుంటే.. అలా వదిలేస్తామా? లేదా తిరిగి డొమినికాకు పట్టుకొచ్చి శిక్షిస్తామా?" అని ఆయన ప్రశ్నించారు.