కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 వ్యాక్సిన్‌లు తుది/మూడోదశ ప్రయోగాలకు చేరుకున్నాయి. రష్యా, చైనా మినహా వీటిలో మొత్తం నాలుగు టీకాలు ఇప్పటికే అత్యవసర వినియోగం కింద అనుమతి పొందాయి. వీటిలో భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ కూడా ఉంది. చైనా సినోఫార్మ్, రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్‌ల పంపిణీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో కోటీ 20లక్షల మంది వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లు సమాచారం.
ఇక, కొవిడ్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 154కు పైగా ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం 20 వ్యాక్సిన్‌లు తొలి దశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా, మరో 16 వ్యాక్సిన్‌లు రెండో దశలో ఉన్నాయి. ఇక 13 వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. తుది దశ ప్రయోగాలను కొనసాగిస్తున్న 13 వ్యాక్సిన్‌లలో ఫైజర్-బయోఎన్‌టెక్‌లు రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్ మొదటగా అనుమతి ఇచ్చింది. తర్వాత మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్ అమెరికాలో అనుమతి పొందగా, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు తాజాగా బ్రిటన్ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో చైనాకు చెందిన సినోఫార్మ్ అక్కడి ప్రజా వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా తుదిదశ ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్‌లు అత్యవసర/ప్రజా వినియోగం కింద అందుబాటులోకి వస్తున్నాయి.
తొలి వ్యాక్సిన్‌గా ఫైజర్..
అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వచ్చిన తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఫైజర్ నిలిచింది. దీన్ని తొలుత బ్రిటన్ ఆమోదించగా తర్వాత అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతరం సౌదీ అరేబియా, మెక్సికో వంటి దేశాలు కూడా ఆమోదించాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపింది. భారత్‌లోనూ వ్యాక్సిన్ వినియోగం కోసం ఫైజర్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇక్కడి నియంత్రణ సంస్థలు వీటిపై నిర్ణయం తీసుకోలేదు. ఈ టీకాను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతల (మైనస్ 70డిగ్రీల సెల్సియస్) వద్ద నిల్వ చేయాల్సి ఉండడం ఒక సవాలుగా మారిందనే చెప్పవచ్చు.
మోడెర్నా..
కరోనా వ్యాక్సిన్‌లో ముందున్న మోడెర్నా అమెరికాలో అనుమతి పొందిన రెండో టీకాగా రికార్డుకెక్కింది. అధ్యక్ష ఎన్నికల నాటికి అమెరికాలో తొలుత మోడెర్నా వ్యాక్సిన్ వస్తుందని భావించారు. కానీ, అప్పటివరకు ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. ఇక వ్యాక్సిన్ సమర్థత 94.1శాతం ఉన్నట్లు మోడెర్నా ఇదివరకే ప్రకటించింది. అంతేకాకుండా ఫైజర్‌తో పోలిస్తే మోడెర్నా వ్యాక్సిన్‌ను కాస్త తక్కువ (మైనస్ 20 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకునే సౌలభ్యం ఉంది. అయినప్పటికీ ఫైజర్‌తో పాటు మోడెర్నా టీకాను అమెరికాలో భారీ స్థాయిలో పంపిణీ చేస్తున్నారు.
మూడో వ్యాక్సిన్‌గా ఆస్ట్రాజెనెకా..
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన వ్యాక్సిన్‌పై యావత్ ప్రపంచం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అత్యంత తక్కువ ధర, సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకునే సౌలభ్యంతో పాటు సురక్షితమైనదని తేలడంతో ఈ వ్యాక్సిన్‌ను గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు. ఇక ఈ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన తొలి దేశంగా బ్రిటన్ నిలువగా, తాజాగా భారత్ కూడా ఆమోదం తెలిపింది. టీకా సామర్థ్యం 70శాతం ఉన్నట్లు బ్రిటన్, భారత్‌లలోని నియంత్రణ సంస్థలు ధ్రువీకరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఏర్పడ్డ ‘గవి’ కూటమి ద్వారా యావత్ ప్రపంచ దేశాలకు ఈ టీకాను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.