అమెరికాలో టోర్నడో విధ్వంసం సృష్టిస్తోంది. కొన్నికిలోమీటర్ల మేర వ్యాపించిన సుడిగాలికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, చెట్లు ధ్వంసమయ్యాయి. జార్జియా, ఫ్లోరిడా, దక్షిణ కరోలినాలకు సుడిగాలి హెచ్చరికలు జారీచేశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు
"సుడిగాలిని చూసినప్పుడు కనీసం 400 మీటర్ల వెడల్పుతో ఉన్నట్లు కనిపించింది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలా మైళ్లు ప్రయాణం చేశాం. ఇది తీవ్ర నష్టం. నేలమట్టమైన ఇళ్లను చూస్తే దీన్ని భారీ విపత్తుగా పరిగణించక తప్పదు." - షరీఫ్ జోన్స్, స్థానికుడు
ఆగ్నేయ అలబామాలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు 23 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. చెట్లు కూలి రోడ్లపై పడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం మరో టోర్నడో వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు వేగవంతం చేశారు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. మృతి చెందిన 23 మంది లీ కంట్రీకి చెందిన వారే కావడం గమనార్హం.
"అలబామా, పరిసర ప్రాంత ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. టోర్నడోలు, తుపానులు చాలా ప్రమాదకరం. త్వరలో మరిన్ని వచ్చే అవకాశం ఉంది. బాధిత ప్రజలు, స్నేహితులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు