Tornado in America: అమెరికాపై విరుచుకుపడిన టోర్నడో ధాటికి కెంటకీ కొవ్వొత్తుల ఫ్యాక్టరీ సిబ్బందిలో 8 మంది మరణించారు. మరో 8 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయానికి అందులో 110 మంది ఉండగా.. వారిలో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. తర్వాత మరో 50 మందికిపైగా రక్షించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సంస్థ ప్రతినిధి బోబ్ ఫెర్గున్సన్ తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత వారిని ఇళ్లకు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
విద్యుత్ లేకపోవడం వల్ల అదృశ్యమైన వారి జాడ కనుక్కోవడం మొదట్లో కష్టమైందన్నారు. అలాగే ముందు అనుకున్నదాని కంటే.. మరణాలు తక్కువగా ఉండవచ్చని బోబ్ అంచనా వేశారు.
70 మందికి పైగా..
అమెరికాలో టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 70 మందికి పైగా ఉంటుందని కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషియర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు.
భారీ నష్టం
టోర్నడో ధాటికి కెంటకీలోని బౌలింగ్ గ్రీన్ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. అలస్కాలో ఓ నర్సింగ్‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిప్పి, ఆర్కాన్సాస్, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు.
ఇదీ చూడండి:సుడిగాలుల బీభత్సం- ఎటుచూసినా భీతావహ దృశ్యాలే..