గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా కుయుక్తులను పలు వేదికలపై ఎండగడుతున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ మార్కో రూబియో.. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సంధూతో మాట్లాడారు. భారత ప్రజలకు అమెరికా మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా చైనా అతిక్రమణలకు పాల్పడుతోందని ట్వీట్ చేశారు. చైనా కుట్రలను తిప్పికొట్టే సత్తా భారత్‌కు ఉందని గల్వాన్ ఘర్షణలో స్పష్టం అయిందన్నారు.
సెనేటర్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్‌కన్నెల్ సెనేట్‌లో మాట్లాడుతూ.. భారత్ పట్ల చైనా దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోందని సభకు వివరించారు. జపాన్ అధీనంలో ఉండే సముద్ర జలాలతో పాటు భారత సరిహద్దుల్లో చైనా ఆగ్రహపూరిత వైఖరి అవలంబిస్తోందని మరో సెనేటర్ టామ్ కాటన్ స్పష్టం చేశారు.