కొవిడ్-19ను అడ్డుకునేందుకు మోడెర్నా రూపొందించిన టీకా ప్రాథమిక ఫలితాలపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ టీకా పనితీరు తనను అద్భుతంగా ఆకట్టుకుందని మెచ్చుకున్నారు. కాగా, టీకా కోసం ఎదురుచూస్తోన్న ప్రపంచానికి సోమవారం మోడెర్నా శుభవార్త చెప్పింది. తాము రూపొందించిన టీకా మొదటి మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5శాతం సమర్థతను చూపినట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ఫౌచీ మీడియాతో మాట్లాడారు. "70శాతం, ఎక్కువలో ఎక్కువ 75 శాతం సమర్థతతో పనిచేసే టీకాతోనే నేను సంతృప్తి చెందానని తప్పకుండా అంగీకరించాలి. మన దగ్గర 94.5 శాతం సమర్థతతో పనిచేసే టీకా ఉందనే విషయం అద్భుతంగా ఉంది. ఇది నిజంగా గొప్ప ఫలితం. ఇంత బాగా పనిచేసే టీకా లభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరనుకుంటున్నాను' అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.