తెలంగాణ

telangana

ETV Bharat / international

పిల్లలపై కరోనా ప్రభావం ఎంత? బడికి పంపాలా.. వద్దా? - covid-19 precautions

కరోనా భయాలు వెంటాడుతున్నా... లాక్​డౌన్​ సడలింపులకే ప్రపంచ దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు పున:ప్రారంభమైతే పిల్లల్ని ఎలా పంపాలని తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు. చిన్నారులకు కొవిడ్​-19 సోకే శాతమెంత? సోకితే త్వరగా కోలుకుంటారా? లాంటి పలు ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం.

IMPACT OF CORONA ON CHILDREN
పిల్లలపై కరోనా ప్రభావం ఎంత?

By

Published : May 17, 2020, 7:12 AM IST

కరోనా దెబ్బకు రెణ్నెల్లుగా తలుపులు బిడాయించుకు కూర్చున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే ఆంక్షల్ని సడలిస్తోంది. కొన్ని దేశాల్లో పాఠశాలల్ని తెరుస్తుంటే.. మరికొన్ని దేశాలు తెరవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఒకవేళ పాఠశాలలు పునఃప్రారంభమైతే పిల్లల్ని ఎలా పంపాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. పిల్లలకు కొవిడ్‌ సోకే శాతమెంత? దాన్నుంచి వారు తొందరగా కోలుకుంటారా? వైరస్‌ను ఏ స్థాయిలో వ్యాప్తి చెందిస్తారు? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఈ అంశంపై ఏమైనా అధ్యయనాలు సాగుతున్నాయా? అనేవి ఆసక్తికర విషయాలు.

పిల్లలపై కరోనా ప్రభావం ఎంత?

పిల్లలపై ప్రభావం ఎంత?

కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉన్న చైనా, ఇటలీ, అమెరికాల్లోని 18 ఏళ్ల లోపు పిల్లల్లో 2% కంటే తక్కువ మందికి కరోనా సోకినట్లు బ్రిటన్‌ పరిశోధకులు గమనించారు. అయితే... ఇప్పటివరకు పాఠశాలలు మూసి ఉండటంతోనే పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువ సంఖ్యలో వైరస్‌ బారిన పడలేదని కొందరు పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. పిల్లల్లో వ్యాధి లక్షణాలు సరిగా కనిపించకపోవడంతో వారికి పరీక్షలు తక్కువగానే చేస్తున్నారని హాంకాంగ్‌ పరిశోధకులు అంటున్నారు. అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకున్నాకే బడులను తెరవాలని, వారి నుంచి సామాజిక వ్యాప్తి మొదలవకుండా చూడాలన్నారు. షెన్‌జెన్‌(చైనా)లో మార్చిలో చేసిన పరిశోధన ప్రకారం పదేళ్లలోపు చిన్నారులకు... పెద్దవారి మాదిరిగానే అంటువ్యాధి సోకుతున్నా, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని 'లాన్సెట్‌' జర్నల్‌లో కథనం ప్రచురితమైంది. పరీక్షలు అధికంగా చేస్తున్న దక్షిణ కొరియా, ఇటలీ, ఐస్‌లాండ్‌లలో చిన్నారులకు వైరస్‌ తక్కువగానే సోకుతున్నట్లు వెల్లడైంది.

వైరస్‌ను అతి తక్కువగా మోసుకొస్తారట!

ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్‌ పర్వత ప్రాంతంలో వ్యాధి లక్షణాలున్న ఓ బాలుడు(9) మూడు పాఠశాలలకు వెళ్లి వచ్చినా ఎక్కడా ఎవ్వరికీ వైరస్‌ సోకలేదని ఒక అధ్యయనంలో తేలింది. మొదట్నుంచీ పాఠశాలలను తెరిచే ఉంచిన సింగపూర్‌లో 'చిన్నపిల్లలు... వైరస్‌ వ్యాప్తి' అనే అంశంపై ఆస్ట్రేలియాకు చెందిన వైరాలజిస్టులు అధ్యయనం చేశారు. ఒక కుటుంబంలోకి మిగతా సభ్యులతో పోల్చి చూస్తే చాలా ఆలస్యంగా వైరస్‌ని తీసుకొస్తారని, అది 8% ఉంటుందని తెలిపారు.

రోగ నిరోధక శక్తిలోనూ తేడా

పెద్దలతో పోలిస్తే పిల్లలు కొవిడ్‌ను ఎక్కువ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు వివిధ పరిశోధనలు తేల్చాయి. పిల్లల ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ను ఆకర్షించే ఏస్‌-2 ఎంజైమ్‌ తక్కువగా ఉంటోందని వారు చెబుతున్నారు. ఈ కారణంగానే వైరస్‌ సోకిన చిన్నారుల్లో ఒక్కోసారి స్వల్పంగా కొన్నిసార్లు అసలేమీ లక్షణాలు బయటపడటంలేదు. కొందరు మాత్రమే తీవ్రంగా జబ్బుపడుతున్నారు. వారిలోనూ చాలా తక్కువ మందే చనిపోతున్నారు.

  • 15 ఏళ్లలోపు పిల్లలు తరచూ వైరస్‌ల బారినపడుతూ జలుబు, దగ్గు, ఉబ్బసంతో ఇబ్బందులు పడుతుంటారని, అప్పుడు యాంటీబాడీలు తయారవుతుండటంతో అవే ఇప్పుడు సార్స్‌ కోవ్‌-2తో సైతం పోరాటం చేస్తున్నాయనే మరో వాదనా ఉంది.
  • వైరస్‌ సోకిన తర్వాత సైటోకైన్‌ల ఉత్పత్తి స్థాయి చిన్నారుల్లో తక్కువగా ఉంటోంది. ఈ కారణంగా వారి ఇతర అంతర్గత అవయవాలకు ఎలాంటి ప్రమాదం జరగడంలేదు. పెద్దల్లో ఇందుకు విరుద్ధంగా సైటోకైన్‌ తుపాను రేగుతుండటంతో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని వివిధ దేశాల పరిశోధకులు తేల్చారు. మొత్తంగా చూస్తే పిల్లలను పాఠశాలలకు పంపించే ముందే సకల జాగ్రత్తలు తీసుకోవాలని, వారు కూర్చునే చోటు, ప్రయాణించే వాహనాలను నిత్యం డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలంటున్నారు.
    డెన్మార్క్​లో భౌతికదూరం పాటిస్తూ పాఠశాలలకు హాజరు

ఇదీ జరుగుతున్న నష్టం

'లాక్‌డౌన్‌ల కారణంగా 190 దేశాల్లోని 157 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. పేద దేశాల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందట్లేదు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సుమారు 37 దేశాల్లో 12 కోట్ల మంది చిన్నారులకు తట్టు టీకాలు వేయలేదు. భారత్‌లో 40% మంది పిల్లలకు టీకాలు సరైన సమయంలో వేయలేకపోతున్నాం' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది.

ఇలాగైతే మేలు...

  • పాఠశాలలు తెరవడమంటే గతంలో మాదిరి గుంపులుగా కూర్చోబెట్టడం కాదు. పూర్తిగా కొత్త పద్ధతులు తీసుకురావాలి.
  • భౌతిక దూరం పాటించడంలో భాగంగా తరగతి గదిలో బెంచీలు/కుర్చీలను దూరంగా జరపాల్సి ఉంటుంది.
  • స్థల సమస్య పరిష్కారానికి ప్రతి తరగతిని రెండేసి బృందాలుగా విడదీసి, ఒక్కో బృందానికి వారానికి 4 రోజులు మాత్రమే పాఠాలు చెప్పాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.
  • సగం తరగతులు ఆన్‌లైన్‌లో జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ప్రైవేటు పాఠశాలలకు కొంతమేర సాధ్యమైనా, ప్రభుత్వ పాఠశాలలు మొదట్లో సమస్య ఎదుర్కోవచ్చు.
  • పిల్లలందరికీ మాస్కులు, చేతుల శుభ్రత తప్పనిసరి.
  • పాఠశాల పరిసరాల్ని తరచూ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి. పిల్లలకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
  • ఇంకొంత కాలంపాటు క్రీడా మైదానాలను మూసేయాలి.

వివిధ దేశాల్లో ఏం చేస్తున్నారు?

  • ఫ్రాన్స్‌లో ప్రతి తరగతిలో 15 మంది విద్యార్థులే ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని షరతులు విధించారు.
  • డెన్మార్క్‌, జర్మనీల్లో ప్రతి విద్యార్థి మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. తరగతి గదిలో ఒక్కో విద్యార్థి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేయించారు.
  • తైవాన్‌లో విద్యార్థుల మధ్య అట్టలను పెట్టి భౌతిక దూరం సృష్టించారు. స్వీడన్‌లో పాఠశాలలను మూయలేదు. చేతుల శుభ్రత, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటిస్తున్నారు.
  • చైనాలో పాఠశాలకు వచ్చే విద్యార్థులందరినీ, వారి పుస్తకాల సంచులను శానిటైజ్‌ చేస్తున్నారు. మాస్కులు మారుస్తున్నారు.
  • బ్రిటన్‌లో తొలివిడత 2% మంది పిల్లలతో బడులు తెరిచారు.
  • ఆస్ట్రేలియాలో సెకండ్‌ టర్మ్‌ కోసం అన్ని జాగ్రత్తలతో పాఠశాలలను తెరిచారు. పిల్లలను పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని తల్లిదండ్రులకే వదిలేశారు.

ఇదీ చూడండి:తుపానుగా మారిన వాయుగుండం-'ఆంఫాన్‌'గా నామకరణం

ABOUT THE AUTHOR

...view details