అమెరికాపై కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యా భారీగా పెరుగుతోంది. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లోని ప్రార్థనా మందిరాలు, ఫలహారశాలలు, విశ్రాంత గదులు, హాళ్లతో పాటు పార్కింగ్ గ్యారేజీలను కూడా చికిత్స ప్రాంతాలుగా మార్చుతున్న సందర్భాలు ఉన్నాయి. పడకలు సరిపోక.. సమీప వైద్య కేంద్రాల్లో అదనంగా ఉండే పడకల కోసం వెతుకుతున్నారు సిబ్బంది. క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఒత్తిడి, అలసట వంటివి కనిపిస్తున్నాయి.
" ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. చికిత్స అందించే క్రమంలో మేము ఒత్తిడికి గురవుతున్నాం. నిరంతర సేవలతో నిరాశతో పాటు అలసిపోతున్నాం. కొన్ని సార్లు కన్నీళ్లతో విధులకు హాజరవటం, కన్నీళ్లతోనే విధులు ముగించుకొని వెళ్లటం జరుగుతోంది. "
- అలిసన్ జాన్సన్, జాన్సన్ సిటీ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్, టెన్నెస్సీ
కొద్ది నెలలుగా అమెరికా ఆసుపత్రుల్లోని బాధితుల సంఖ్య రెండింతలు పెరిగింది. ఈ వారంలో ఆసుపత్రుల్లో చేరుతున్న రోజువారి రోగుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేసింది. గత మంగళవారం సుమారు 77,000 మంది వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరారు. కొత్త కేసులు గత రెండు వారాల్లో 80 శాతానికిపైగా పెరిగాయి. రోజువారీ కొత్త కేసుల సగటు సంఖ్య 1,60,000కుపైగానే ఉంటోంది. దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. మరణాలు రోజుకు సగటున 1,155కు చేరాయి. ఈ నెలలో ఇదే అత్యధికం.