చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ యాజమాన్యానికి అమెరికాలో మరోమారు ఊరట లభించింది. తమ హక్కులను అమెరికా కంపెనీలకు బదిలీ చేయకుంటే నవంబర్ నుంచి పూర్తిస్థాయిలో నిషేధం ఉంటుందన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను వాయిదా వేశారు పెన్సిల్వేనియా కోర్టు ఫెడరల్ న్యాయమూర్తి. ట్రంప్ నిర్ణయం తమ స్వేచ్ఛా సంభాషణలకు ఆటంకం కలిగిస్తోందని పెన్సిల్వేనియాకు చెందిన హాస్యనటుడు సహా మరో ఇద్దరు టిక్‌టాక్ వినియోగదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
పెన్సిల్వేనియాకు చెందిన హాస్యనటుడు డగ్లస్ మార్లాండ్, దక్షిణ కాలిఫోర్నియా ఫ్యాషన్ డిజైనర్ కోసేట్ రినాబ్, సంగీతకారుడు అలెక్ ఛాంబర్స్లు.. కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టారు జిల్లా న్యాయమూర్తి వెండి బీటిల్స్టోన్. కీలక సాంకేతిక సేవలను నిలిపివేస్తూ.. అమెరికాలో టిక్‌టాక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించేందుకు వాణిజ్య విభాగం త్వరలోనే తీసుకోబోయే చర్యలను అడ్డుకున్నారు.
"అధ్యక్షుడు తన అధికారాలను మించి విధించిన ఈ నిషేధాన్ని న్యాయమూర్తి నిలిపివేసినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ చర్య స్వేచ్ఛా సంభాషణకు మన దేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది."