తెలంగాణ

telangana

ETV Bharat / international

చంద్రుడి గురించి నాసా కొత్త కబురు- 26న ప్రకటన - నాసా కొత్త ఆవిష్కరణ

జాబిల్లి గురించి కొత్త కబురును ఈనెల 26న వెల్లడిస్తామని తెలిపింది అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా. ఈ కొత్త ఆవిష్కారం.. సుదూర అంతరిక్ష యాత్రలకూ దోహదపడుతుందని వివరించింది. నాసాకు చెందిన 'సోఫియా' అబ్జర్వేటరీ దీనిని కనుగొంది.

NASA's Sophia Observatory
సోఫియా అబ్జర్వేటరీ

By

Published : Oct 24, 2020, 9:40 AM IST

చంద్రుడి గురించి 'ఉత్తేజభరితమైన' అంశాన్ని కనుగొన్నామని అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) వెల్లడించింది. దీన్ని సోమవారం ప్రకటిస్తామని, జాబిల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కొత్త ఆవిష్కారం వీలు కల్పిస్తుందని తెలిపింది. సుదూర అంతరిక్ష యాత్రలకూ దోహదపడుతుందని వివరించింది. నాసాకు చెందిన 'స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఆస్ట్రోనమీ' (సోఫియా) అబ్జర్వేటరీ ద్వారా ఈ కొత్త ఆవిష్కారం జరిగింది.

ఎందుకు అంత ముఖ్యం?

సైన్స్‌లో ప్రతి కొత్త అంశమూ ముఖ్యమే. అనేక కొత్త అవకాశాలకు అది ద్వారాలు తెరుస్తుంది. మానవ అవగాహనను పెంచుతుంది. ఇక చంద్రుడి విషయానికి వస్తే.. 2024లో అక్కడికి మానవులను పంపాలని నాసా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వెలుగులోకి వచ్చే అంశం ఆ యాత్రకు ఉపయోగపడొచ్చు. 'అర్టెమిస్‌' పేరుతో చందమామపైకి తొలి మహిళను పంపాలని నాసా భావిస్తోంది.

బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త

తాజా ఆవిష్కారం గురించి ప్రకటన చేయడానికి నాసా ఒక టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. పలువురు శాస్త్రవేత్తలతో ఒక కమిటీని ఇందుకు ఎంపిక చేసింది. వీరిలో భారత సంతతికి చెందిన నసీం రంగ్‌వాలా ఉన్నారు. సోఫియాకు ప్రాజెక్టు సైంటిస్టుగా ఆమె వ్యవహరిస్తున్నారు.

ఏ అంశాలను కనుగొంది?

కొత్తగా పుట్టుకొచ్చిన నక్షత్రాల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రసాయన తీరుతెన్నులను సోఫియా ఇటీవల పరిశీలించింది. భవిష్యత్‌లో ఆ ప్రాంతాల్లో గ్రహాలు ఏర్పడనున్నాయి. అక్కడ భారీగా నీరు, సేంద్రియ పదార్థాలు ఉన్నట్లు సోఫియా గుర్తించింది. దీంతో జీవానికి అవసరమైన కీలక అంశాలు.. కొత్తగా పుట్టుకొచ్చే గ్రహాల్లో ఎలా కలుస్తాయన్నది తెలుసుకునేందుకు వీలు కలిగింది. వందల కోట్ల ఏళ్ల కిందట సూర్యుడి చుట్టూ.. భూమి, ఇతర గ్రహాలు ఆవిర్భవించే సమయంలోనూ ఇదే ప్రక్రియ చోటుచేసుకుంది.

ఏమిటీ సోఫియా?

సోఫియా.. ప్రపంచంలోనే అతిపెద్ద గగనతల అబ్జర్వేటరీ. నాసా, జర్మనీ అంతరిక్ష సంస్థ డీఎల్‌ఆర్‌లు ఉమ్మడిగా దీన్ని చేపట్టాయి. విశ్వంలో సహజసిద్ధంగా జరిగే అనేక పోకడలను పరిశీలించడానికి ఇది భూ ఎగువ వాతావరణంలో విహరిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇది బోయింగ్‌-747ఎస్‌పీ విమానం. 106 అంగుళాల వ్యాసం, 9 అడుగుల పొడవు కలిగిన ఒక టెలిస్కోపును మోసుకెళ్లేలా దీనికి మార్పులు చేశారు. భూ వాతావరణంలో చాలా ఎత్తులో ఎగరడం వల్ల.. సోఫియాలోని టెలిస్కోపు విశ్వం, సౌర కుటుంబానికి సంబంధించిన విస్పష్ట చిత్రాలను ఆవిష్కరిస్తుంది. వాతావరణంలోని నీటి ఆవిరి వల్ల భూమి మీదున్న టెలిస్కోపుల వీక్షణకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అయితే సోఫియా ప్రయాణించే ఎత్తు వల్ల వాతావరణంలోని 99 శాతం నీటి ఆవిరిని ఇది తప్పించుకోగలుగుతుంది. దృశ్యకాంతి ద్వారా గుర్తించలేని అనేక అంశాలను పరారుణ తరంగ దైర్ఘ్యంలో పరిశీలిస్తుంది.

ఇదీ చూడండి: మంచుకొండల మాటున మహాముప్పు!

ABOUT THE AUTHOR

...view details