కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిశోధకులు సరికొత్త ఉపకరణాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఎమ్‌ఐటీ(మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సెన్సార్ల సహాయంతో కరోనాను గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఈ సెన్సార్లు ఉన్న మాస్కులు ధరించిన వెంటనే అవి ఒక రకమైన వెలుతురును ప్రసరింపజేస్తాయి. ఆ వెలుగు కంటికి కనిపించనప్పటికీ థర్మల్ స్కానర్ సహాయంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఎలా పనిచేస్తాయి?
ఈ మాస్కుల్లో సెన్సార్లను పేపర్ లేదా ప్లాస్టిక్‌పై అతికించి దాన్ని జెనిటిక్ మెటీరియల్ సహాయంతో వస్త్రంతో కలిపి మాస్కులా రూపొందిస్తున్నారు. ఇది గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలలపాటు అలాగే ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ప్రత్యేక సాంకేతికతతో రూపొందిన ఈ మాస్కులు ధరించిన వ్యక్తి.. గాలి పీల్చినప్పుడు అందులోని తేమ, మాట్లాడినప్పుడు నోటి నుంచి వెలువడే లాలాజలం తుంపర్లను సెన్సార్లు గ్రహిస్తాయి. వాటిలో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఒక రకమైన కాంతిని వెదజల్లుతాయి. ఆ కాంతిని ఫ్లోరీమీటర్స్ సహాయంతో వెంటనే గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఈ ఫ్లోరీమీటర్స్‌ను విమానాశ్రయాల భద్రతా ద్వారాల వద్ద, ఆస్పత్రుల్లో, జనసాంద్రత ఉండే ప్రదేశాల్లో అమర్చి కరోనా సోకిన వ్యక్తులను ముందుగానే గుర్తించవచ్చని పరిశోధన బృందంలో సభ్యుడైన జిమ్ కోలిన్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు.