"ఛాంప్.. మనిషిని అంచనా వేసేటప్పుడు అతడు ఎన్నిసార్లు కింద పడ్డాడన్నది చూడకూడదు. అతడు ఎంత వేగంగా లేచి నిలబడ్డాడు అన్నదే చూడాలి" అని ఓ తండ్రి తన బిడ్డకు చెప్పాడు. అది ఆ బాలుడి మనసుపై బలమైన ముద్ర వేసింది. నత్తితో బాధపడుతున్న ఆ 13 ఏళ్ల బాలుడి కుటుంబం.. కొన్నాళ్లకు తమ స్వస్థలం నుంచి వలస వెళ్లింది. అక్కడ కొత్త పాఠశాలలో చేరితే తోటి విద్యార్థులు అతడిని డాష్ అని గేలి చేసేవారు. దీంతో ఆ చిన్నారి పట్టుదలతో ఆ సమస్యను అధిగమించాడు. తదనంతర కాలంలో న్యాయ విద్యను పూర్తిచేసి కోర్టులో అనర్గళంగా వాదించాడు. తన వాక్పటిమ, పనితీరుతో చుట్టుపక్కల వారిని ఆకర్షించాడు. 29 ఏళ్ల వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికయ్యాడు. అక్కడి నుంచి దాదాపు 35 ఏళ్లపాటు తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. అనంతరం కాలంలో ఆ దేశానికి ఉపాధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడికి ఉంటే ఇలాంటి భాగస్వామి ఉండాలి అనేలా పనిచేశారు. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఆయనే అమెరికా రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం అనుభవశీలుడు... 'లంచ్ ప్యాకెట్ జో', 'వర్కింగ్ క్లాస్ జో' 'మిడిల్ క్లాస్ జో' అంటూ పార్టీలకు అతీతంగా అందరూ పిలుచుకునే సన్నిహితుడు.. విదేశీ వ్యవహారాల్లో తలపండిన నిపుణుడు అమెరికా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్..!
పెన్సిల్వేనియాలో పుట్టి.. డెలావర్‌లో ఎదిగి..
పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో 1942 నవంబర్ 20 జో బైడెన్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జోసఫ్ ఓ చిన్న ఉద్యోగి. తల్లి కేథరిన్ గృహిణి. కష్టాలకు ఓర్చుకొని నిలబడే మనిషిగా వీరు బైడెన్‌ను తీర్చిదిద్దారు. 'మనిషిని అంచనా వేసేటప్పుడు అతడు ఎన్నిసార్లు కింద పడ్డాడన్నది కాదు.. ఎంత వేగంగా లేచి నిలబడ్డాడనేది చూడాలి' అంటూ తన తండ్రి చెప్పిన మాటలను ఇప్పటికీ జో గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీరి కుటుంబం 1955లో డెలావర్‌లోని మేఫీల్డ్‌కు వలస వెళ్లింది. అక్కడే జో విద్యాభ్యాసం చేశాడు. అక్కడే ఆయనకు ప్రఖ్యాత అర్చ్మెర్ అకాడమీలో సీటు వచ్చింది. చదువులో ముందుండే బైడెన్.. క్రీడల్లోనూ సత్తా చాటేవాడు. ఆర్చ్మెర్ ఫుట్‌బాల్ టీమ్‌లో ఆయన సభ్యుడు. బక్కపలచగా ఉండే బైడెన్ 'పాస్‌లు' అందించడంలో దిట్ట. 1961లో డెలావర్ విశ్వవిద్యాలయంలో చరిత్ర, రాజనీతి శాస్త్రం కోర్సులో చేరాడు. అక్కడ మొదటి రెండేళ్లు చదువు కంటే పార్టీలు, ఫుట్‌బాల్, అమ్మాయిలతోనే సమయం వృథా అయ్యిందని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. కానీ, అదే సమయంలో బైడెన్‌కు రాజకీయాలపై ఆసక్తి కలిగింది.
బహమాస్ ట్రిప్‌లో ప్రేమ..
బైడెన్ కుర్రాడిగా ఉన్నప్పుడు ఒక సారి బహమాస్ యాత్రకు వెళ్లారు. అక్కడికి సిరాక్యూస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నీలియా హంటర్ వచ్చారు. ఆమెను తొలిచూపులోనే ప్రేమించారు. 1966లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. 1968లో సిరాక్యూస్ విశ్వవిద్యాలయం లా స్కూల్ నుంచి న్యాయవిద్యను పూర్తి చేశారు. వెంటనే విల్మింగ్టన్లో ఒక లా సంస్థలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఆయన డెమొక్రటిక్ పార్టీలో చురుగ్గా పనిచేయడం ప్రారంభించారు. 1970లో తొలిసారి డెమొక్రటిక్ పార్టీ తరపున 'న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్'కు ఎన్నికయ్యారు. 1971లో సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు.
కుర్ర సెనేటర్.. ఆసుపత్రిలో ప్రమాణ స్వీకారం
నీలియా, బైడెన్లకు జోసఫ్(బ్యూ), హంటర్, నవోమీ (అమీ) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1972లో ఆయన డెలావర్‌కు సెనేటర్‌గా ఎంపికయ్యారు. అప్పట్లో అమెరికా చరిత్రలో అతిచిన్న వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికైన వారిలో బైడెన్ ఐదో వ్యక్తి. అయితే, ఆ సంతోషం బైడెన్‌కు ఎక్కువ రోజులు నిలవలేదు. అదే ఏడాది క్రిస్మస్కు వారం ముందు బైడెన్ భార్యాబిడ్డలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో భార్య నీలియా, ఏడాది వయసున్న కుమార్తె అమీ మరణించారు. కుమారులు బ్యూ, హంటర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదంతో కుంగిపోయిన ఆయన.. ఓ దశలో ఆత్మహత్య చేసుకొందామనుకున్నారు. కానీ, కుటుంబం అండగా నిలవడంతో ఆయన ధైర్యం కూడదీసుకున్నారు. వాషింగ్టన్లో జరిగిన సెనేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లలేదు. తమ కుమారులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి గదిలోనే ప్రమాణ స్వీకారం చేశారు. పిల్లలను ఆ స్థితిలో వదిలేసి తాను వాషింగ్టన్ వెళ్లలేకపోయారు. దీంతో విల్మింగ్టన్‌లోనే ఎక్కువ సమయం గడిపారు. పిల్లల కోసం నిత్యం విల్మింగ్టన్-వాషింగ్టన్ మధ్య అమ్ట్రాక్ రైలులో డైలీ సర్వీస్ చేసేవారు. 1977లో జిల్ ట్రేసీ జాకబ్స్ అనే టీచర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
విదేశీ వ్యవహారాల నిపుణుడిగా..
1973-2009 వరకు ఆయన సెనేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల కమిటీకి ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. సోవియట్‌తో కలిసి అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన ఒప్పందాల్లో.. బాల్కన్ దేశాల్లో శాంతి స్థాపనకు.. సోవియట్ మాజీ దేశాలను చేర్చుకొని 'నాటో' కూటమి విస్తరించడంలో బైడెన్‌దే కీలక పాత్ర పోషించారు. తొలి గల్ఫ్ యుద్ధాన్ని వ్యతిరేకించిన వారిలో బైడెన్ కూడా ఉన్నారు. ఇరాక్ యుద్ధం విషయంలో జార్జి డబ్ల్యూ బుష్ వైఖరిని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అమెరికాలోని నేర నియంత్రణకు సంబంధించి కీలక చట్టాల తయారీలో బైడెన్ కీలక పాత్ర పోషించారు. క్రైమ్ కంట్రోల్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టిందీ ఆయనే. దీంతో అమెరికాలో నేర నియంత్రణకు పోలీసు అధికారుల సంఖ్య మరో లక్ష పెరిగింది.