ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల డోసుల కొవిడ్-19 టీకాలను (Covid-19 Vaccine) కేటాయించనున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలకు 1.6 కోట్ల డోసులను ఇస్తామని తెలిపింది. అమెరికాలోని జో బైడెన్ సర్కారు ఇప్పటికే 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించింది. తాజా ప్రకటనతో ఆ కేటాయింపు 8 కోట్ల డోసులకు చేరుతుంది.
"స్వదేశంలో ఈ మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా దీనికి ముగింపు పలికేందుకు కృషి చేస్తాం. ప్రపంచానికి 'టీకాల ఆయుధాగారం'గా అమెరికాను మారుస్తామని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా దేశీయ సరఫరా నుంచి వ్యాక్సిన్లను విరాళంగా ఇస్తాం. ఈ నెల చివరి నాటికి 8 కోట్ల డోసులను కేటాయించాలని బైడెన్ హామీ ఇచ్చారు." అని అమెరికా అధ్యక్ష భవనం' వైట్ హౌస్' పేర్కొంది. ఈ టీకాల్లో(Covid-19 Vaccine) 75 శాతాన్ని 'కొవాక్స్' కింద అందించనున్నట్లు తెలిపింది.