తెలంగాణ

telangana

'లామ్డా​' వైరస్​ దెబ్బ- ఆ దేశాలు గజగజ!

By

Published : Jul 9, 2021, 2:47 PM IST

కరోనా డెల్టా వేరియంట్‌ కారణంగా ప్రపంచదేశాలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కొత్తగా వెలుగుచూసిన లామ్డా వెరియంట్​ అంతకంటే ప్రమాదకరమని నిపుణుల వెల్లడించడం మరింత ఆందోళన కల్గిస్తోంది. లామ్డా వేరియంట్ అన్ని రకాల కంటే ప్రాణాంతకమని మలేసియా ఆరోగ్య శాఖ తెలిపింది. గత నాలుగు వారాల్లో దాదాపు 30 దేశాల్లో ఈ రకం కరోనాను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని 'దృష్టి సారించాల్సిన రకం'గా ప్రకటించింది.

The Lambda Covid-19 variant is more dangerous than the delta variant
ప్రపంచ దేశాలను వణికిస్తున్న 'లామ్డా వేరియంట్​'

కరోనా వేరియంట్లలో డెల్టా రకమే అత్యంత ప్రమాదకరమని అంతా భావిస్తున్న తరుణంలో.. కొత్తగా వెలుగు చూసిన లామ్డా రకం దాని కంటే ప్రాణాంతకమని తేలడం ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. లామ్డా వేరియంట్‌ను మొదట గుర్తించిన పెరూలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తాజాగా మలేసియా ఆరోగ్యశాఖ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా వేరియంట్‌ కంటే లామ్డానే మరింత ప్రాణాంతకమని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అక్కడి మీడియా సంస్థ ఒకటి పేర్కొంది.

లామ్డా వేరియంట్(C.37)​ను 'దృష్టి సారించాల్సిన రకం'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్​ 14నే ప్రకటించింది. దీన్ని మొదట 2020 డిసెంబర్​లో పెరూలో గుర్తించారు. మే, జూన్‌ నెలల్లో అక్కడ వెలుగుచూసిన 82 శాతానికిపైగా కరోనా కేసులకు ఈ రకమే కారణమని మరో వార్త సంస్థ వెల్లడించింది. ఇందుకోసం పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్-PAHO కథనాన్ని ఉటంకించింది. అలాగే చిలీ దేశంలో 31 శాతం కేసుల్లో ఈ రకం కనిపించింది.

ఇప్పటివరకు దాదాపు 30 దేశాల్లో లామ్డా వేరియంట్​ను గుర్తించారు. వాటిలో లాటిన్ అమెరికా దేశాలే ఎక్కువగా ఉన్నాయి. లామ్డా వేరియంట్ తీవ్రత ఏమేరకు ఉందో తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ దృష్టిసారించాయి. బ్రిటన్‌లోనూ ఈ రకానికి సంబంధించి ఆరు కేసులను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

అయితే లామ్డా.. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఇంగ్లాండ్ ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీని తీవ్రత, వాక్సిన్లు ఈ రకంపై సమర్థంగా పని చేస్తున్నాయా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయోగాలు జరుతున్నాయని పేర్కొన్నారు.

కెనడాలో 11 కేసులు..

కెనడాలో ఇప్పటివరకు 11 లామ్డా వేరియంట్ కేసులను గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మార్చి, ఏప్రిల్​ నాటికే ఈ రకం కేసులు 27 నమోదైనట్లు క్యుబెక్​ జాతీయ ప్రజారోగ్య సంస్థ తెలిపింది. దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో ఇంకా తెలుసుకోవాల్సి ఉందని ఆరోగ్య అధికారులు చెప్పారు.

టీకా ప్రభావం..

ఫైజర్​, మోడెర్నా వంటి ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు.. లామ్డా వేరియంట్​పై కాస్త తక్కువ ప్రభావం చూపుతున్నాయని న్యూయార్క్ యూనివర్సిటీ జులై 2న అధ్యయనాన్ని ప్రచురించింది. అయితే వ్యాక్సిన్ల నుంచి కలిగే రక్షణను ఈ వేరియంట్లు పూర్తిగా నిలువరించలేవని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కేరళలో జికా వైరస్​ విజృంభణ- మరో ముప్పుగా మారేనా?

ABOUT THE AUTHOR

...view details