వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆశావహులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నాటికి అన్ని విధాలా సిద్ధమై ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో కీలకమైన నిధుల సేకరణ అంశం డెమోక్రటిక్ పార్టీలో వివాదానికి తెరలేపింది.
డెమోక్రటిక్ పార్టీకి చెందిన మేయర్ పీటీ బట్టిగిగ్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమవుతుండగా.. ఆయన మద్దతుదారులైన క్రేగ్ హాల్, కాథరిన్ హాల్ దంపతులు నిధుల సేకరణ కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
బిలియనీర్లకు మాత్రమే...
నెపా లోయలోని విలాసవంతమైన తమ 'హాల్ రూతర్ఫోర్డ్' మద్యం తయారీ కేంద్రంలోని కేవ్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్లో భారీ మొత్తంలో నిధులు సమీకరించినట్లు డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎలిజిబెత్ వారెన్ ఆరోపించారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష చర్చా వేదికపై ఆమె చేసిన వాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఖరీదైన మద్యం షాపులో అక్రమ పద్ధతిలో నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారామె.
నెపా లోయలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వారికి 2,800డాలర్ల విలువ చేసే మద్యం బాటిళ్లతో విందు ఇచ్చినట్లు ఎలిజిబెత్ ఈ సందర్భంగా విమర్శించారు. ఆ విందుకు సంబంధించిన ఫొటోలను చూస్తే ఇది అర్థమవుతుందని దుయ్యబట్టారామె.