అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడోసారి కాంగ్రెస్ ఉభయసభలు వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన నాయకత్వంలో సాధించిన ఆర్థిక పురోగతిపై వివరించారు. అమెరికా కలలు పునఃస్థాపితమయ్యాయని, దేశం ఇంతకుముందెప్పుడు లేనంత పటిష్ఠంగా ఉందన్నారు.
"ఆర్థిక క్షీణత సమయం ముగిసిపోయింది. హామీల విస్మరణ, నిరుద్యోగం, నెరవేరని ప్రకటనలు, సర్దిచెప్పుకోవడాలు.. అమెరికా సంపదను, శక్తిని, గౌరవాన్ని కుంగదీశాయి. అయితే కలల అమెరికా మళ్లీ వెనక్కి వచ్చింది. అతి పెద్దదైన, నాణ్యమైన, బలమైన అమెరికాను నిర్మించాలన్న కల వెనక్కి వచ్చింది. నేను బాధ్యతలు తీసుకున్న అనంతరం అమెరికా ఆర్థిక ప్రగతిని పునరుత్తేజితం చేసేందుకు.. ఉద్యోగాల కల్పనకు ప్రమాదంగా పరిణమించిన నిబంధనలపై ఉక్కుపాదం మోపాం. నా ఎన్నిక అనంతరం 70 లక్షల నూతన ఉద్యోగాలను సృష్టించాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఆఫ్రికా, హిస్పానిక్, ఆసియా అమెరికన్లలో తమ పాలనలోనే అతి తక్కువ నిరుద్యోగిత నమోదైందన్నారు ట్రంప్.
వాణిజ్య చర్చలపై..
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి చైనా ప్రయోజనాలు పొందుతుందన్న ట్రంప్ ప్రస్తుతం ఈ పరిస్థితిని మార్చామన్నారు. అయితే చైనాతో ఇంతకుముందెప్పుడు లేని ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నామని ఉద్ఘాటించారు. చైనాతో చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని చేసినట్లు వెల్లడించారు.