తెలంగాణ

telangana

ETV Bharat / international

మంచు తుపాను: టెక్సాస్​లో పర్యటించనున్న బైడెన్

అమెరికాను మంచు తుపాను వణకిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో టెక్సాస్​ రాష్ట్రంలోని ప్రజలు ఎటూ కదల్లేని పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టెక్సాస్​లో పరిస్థితిని విపత్తుగా ప్రకటించేందుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు.

Texas weather: Biden to declare major disaster
టెక్సాస్​లో పర్యటించనున్న జో బైడెన్

By

Published : Feb 20, 2021, 4:45 PM IST

Updated : Feb 20, 2021, 5:23 PM IST

మంచు తుపాను ధాటికి విలవిల్లాడుతున్న అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​.. పెద్ద విపత్తుగా ప్రకటించనున్నారు. తద్వారా సహాయక చర్యల కోసం ఫెడరల్​ నిధులను ఖర్చు చేసేందుకు మార్గం సుగమం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్​ తాను టెక్సాస్​ను సందర్శిస్తానని తెలిపారు. తన పర్యటన సందర్భంగా సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. విపత్తుగా ప్రకటించాలని టెక్సాస్​ చేసిన అభ్యర్థనను వేగవంతం చేయాలని బైడెన్​ తన బృందాన్ని ఆదేశించినట్లు వైట్​ హౌస్​ ప్రెస్​ సెక్రెటరీ జెన్​సాకీ తెలిపారు. టెక్సాస్​లోని వివిధ నగరాల మేయర్లతో బైడెన్ మాట్లాడి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.

అమెరికాలో టెక్సాస్​ను కప్పేసిన మంచు
టెక్సాస్​లో కొనసాగుతున్న సహాయక చర్యలు

13 కోట్ల మందికి నీటి ఇక్కట్లు

టెక్సాస్​ రాష్ట్రంలో విద్యుత్​ సరఫరా పునరుద్ధరణ చర్యలను అధికారులు చేపట్టారు. ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ.. 13 కోట్ల మంది సరైన నీటి సదుపాయానికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు బీబీసీ శనివారం కథనం ప్రచురించింది.

పైపుల్లో నీరు గడ్డకట్టగా..

టెక్సాస్​లో శీతల వాతావరణం కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లోనూ విపరీతంగా మంచు కురుస్తోంది. మిసిసీపీలోని జాక్సన్​ నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడ సుమారు. 1.5 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెన్నెస్సీ కౌంటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. పైపుల్లోని నీరు గడ్డకట్టగా.. దక్షిణ అమెరికాలో నీటి కోసం మంచును మరిగించి వాడుకుంటున్నారు. శుక్రవారం నాటికి 1,80,000 ఇళ్లు, వ్యాపార కార్యాలయాలకు విద్యుత్​ సరఫరా లేదు. దాదాపు 33 లక్షల మంది విద్యుత్​ లేకుండా గడిపారు.

వాడే ముందు నీటిని మరిగిస్తున్న టెక్సాస్​ ప్రజలు

పలు చోట్ల నీటిని తాగే ముందు, వంట కోసం ఉపయోగించే ముందు కాచుకోవాలని ప్రజలకు అధికారులు సూచనలు జారీ చేశారు. నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చేసేందుకు 320కు పైగా ప్లంబర్లను అధికారులు రంగంలోకి దించారు.

హూస్టన్​లో పంపిణీ చేస్తున్న నీళ్ల సీసాలు
హూస్టన్​లో నీళ్ల సీసాల కోసం బారులు తీరిన కార్లు

బైడెన్​కు పరీక్ష..

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్​.. గత నెలలోనే బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం నింపడం సహా కరోనా వ్యాక్సిన్​ పంపిణీ ప్రక్రియ బాధ్యతలు ఉన్నాయి. అంతలోనే ఈ శీతల వాతావరణం కారణంగా అమెరికాలో తలెత్తిన పరిస్థితులను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్సాస్​ సహా లూసియానా, ఓక్లహామా ఇతర రాష్ట్రాలను ఆయన విపత్తులుగా ప్రకటించాలని యోచిస్తున్నారు.

ఇదీ చదవండి:అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను

Last Updated : Feb 20, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details