విమానాలకు హెచ్చరికలు, కంపెనీల సిబ్బంది తరలింపు, సర్వత్రా ఆందోళన... అమెరికా- ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఇవి. ఇరు దేశాల మధ్య రోజురోజుకూ సంబంధాలు దెబ్బతింటున్నాయి. యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్న నిపుణుల హెచ్చరికలతో పర్షియన్ గల్ఫ్ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్నారు.
విమాన సంస్థలు... జాగ్రత్త
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే విమానాలు కనపడకుండాపోయే అవకాశముందని హెచ్చరించారు అమెరికా దౌత్యవేత్తలు. ఈ హెచ్చరికలు ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచాయి. అంతర్జాతీయ విమానాలకు గల్ఫ్ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందన్న అమెరికా ఫెడరల్ విమానయాన యంత్రాంగం వ్యాఖ్యలకు అగ్రరాజ్య దౌత్యవేత్తల హెచ్చరికలు మరింత బలోపేతం చేకూరుస్తున్నాయి.