ట్రాన్స్జెండర్ల 'ప్రైడ్ పరేడ్'ను పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది స్వలింగ సంపర్కులు కవాతు నిర్వహించారు. పెరూలో 2 వేల మంది కవాతులో పాల్గొన్నారు. మెక్సికోతో పాటు ఉత్తర మెసడోనియా రాజధాని నగరంలో నిర్వహించిన పరేడ్లో వందల మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. స్వలింగుల గుర్తింపు, హక్కుల సాధనే.. లక్ష్యంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మెక్సికోలోని పాసియో డీ లా రిఫార్మ్ నగరంలో ఇంద్రధనుస్సు రంగుల జెండాలు, గొడుగులు పట్టుకుని వీధుల్లో కవాతు నిర్వహించారు ట్రాన్స్జెండర్లు. సంగీతానికి తగినట్లు నృత్యాలు చేశారు. ట్రాన్స్జెండర్ల హక్కుల ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్ల సంఘాలకు మెక్సికో ప్రభుత్వం 2007లో చట్టబద్ధత కల్పించింది. 'గే' వివాహాలకు 2009లో అనుమతి ఇచ్చింది. అయితే సమాజంలో తమను గౌరవించడం లేదని ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
" ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎంతో శ్రమించాలి. ఇంకా పురుషుల ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంది. ఇప్పటికీ మాకు గుర్తింపు రావటం లేదు. విభిన్న లైంగిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తులుగా మాకు ఉన్న ఈ అడ్డంకులను ఎదుర్కోవటానికి ఈ రకమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాము. ఇలా చేయడం ద్వారా ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. తమను సమాజానికి ముప్పుగా అనుకోరు. "