అమెరికా కాలిఫోర్నియా ప్రజలను కార్చిచ్చు వణికిస్తోంది. గురువారం సాయంత్రం సిల్మర్ ప్రాంతంలో మొదలైన దావానలం బీభత్సంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలో వేలాది ఇళ్లను ఖాళీ చేయాలని ప్రజలను కోరారు. దాదాపు లక్ష మందికిపైగా ప్రభావితమయ్యారు.
గంటకు 800ఎకరాల మేర వ్యాపిస్తున్న కార్చిచ్చును ఇప్పట్లో అదుపు చేయలేమని అధికారులు చెబుతున్నారు. మరో ఆలోచన లేకుండా ప్రజలంతా తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని కోరారు. 200 బృందాలు, 1000 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో హెలికాప్టర్లు, ట్యాంకర్లను వినియోగిస్తున్నారు.
దావానలానికి ఇద్దరు బలి
పోర్టర్ రాంచ్ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా ఓ ఇంటికి నిప్పంటుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో యజమానికి గుండెపోటు వచ్చి మృతిచెందాడు. మరో ఘటనలో 89ఏళ్ల వృద్ధురాలు మంటల నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయింది.