అమెరికా, భారత్ మధ్య జరిగిన చర్చలు.. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం సహా ద్వైపాక్షిక సహకార లక్ష్యాన్ని విస్తృతం చేసేందుకు దోహదపడ్డాయని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా.. ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో భేటీ అయ్యారు.
"అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో సమావేశమవ్వడం సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ, ప్రపంచానికి సంబంధించి వివిధ అంశాలపై మేం చర్చలు జరిపాం. ఇండో పసిఫిక్, క్వాడ్, అఫ్గానిస్థాన్, మయన్మార్, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వంటి అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం."
-జైశంకర్, విదేశాంగ మంత్రి
భారత్-అమెరికా టీకా భాగస్వామ్యంపై బ్లింకెన్‌తో భేటీలో చర్చించామని జైశంకర్ తెలిపారు. వ్యాక్సిన్ సరఫరా గొలుసుకట్టులో భారత్-అమెరికా మధ్య నెలకొన్న సమస్యపై చర్చించామని చెప్పారు. కొన్ని రోజుల్లో దీనిపై ఇరు దేశాల మధ్య స్పష్టమైన నిర్ణయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో భాగంగా.. అమెరికా అందించిన సాయంపై ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
జైశంకర్ పర్యటన ద్వారా.. అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లోని లోతు కనిపించిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక కార్యదర్శి డీన్ థాంప్సన్ పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధాన భాగస్వాములలో ఒకటిగా భారత్‌ను అమెరికా పరిగణిస్తున్నట్లు కనిపించిందని చెప్పారు.
ఇదీ చూడండి:వచ్చే ఏడాది అమెరికా బడ్జెట్ 6 ట్రిలియన్ డాలర్లు