అఫ్గానిస్థాన్ భూభాగం(Afghanistan crisis) నుంచి ఏ విధమైన ఉగ్ర కార్యకలాపాలను అనుమతించమన్న హామీని తాలిబన్లు(Afghanistan Taliban) అమలు చేయాలని.. భారత్ మరోసారి స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా విస్తృత సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయని తెలిపింది.
ఐరాస 76వ వార్షిక సమావేశాల(un general assembly) సందర్భంగా జీ20 దేశాల విదేశాంగ మంత్రుల(G20 ministerial meeting 2021) సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
" అఫ్గాన్ ప్రజలతో ఉన్న చారిత్రక స్నేహం ఆధారంగానే భవిష్యత్తు సంబంధాలు ఉంటాయి. మానవతా అవసరాల కోసం అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది. సాయం చేసేవారికి ఎలాంటి అవరోధాలు, ఆంక్షలు లేని ప్రవేశం ఉండాలి. ఉగ్రవాదానికి తమ భూభాగాన్ని వినియోగించబోమన్న హామీని తాలిబన్లు అమలు చేయాలి. "