అంగారకగ్రహంపై అడుగుపెట్టిన అమెరికా వ్యోమనౌక 'పర్సెవరెన్స్'... మొదటిసారిగా మార్స్‌పై ఉన్న గాలి శబ్దాలను రికార్డు చేసి పంపింది. ఫ్రెంచ్ అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఐదు ఆడియో ఫైల్స్‌ను షేర్ చేసింది. వ్యోమనౌకలో అమర్చిన సూపర్‌క్యామ్ ద్వారా ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"అంగారక గ్రహంపై సూపర్‌క్యామ్ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం మొదటిసారి ఈ పరికరం తయారు చేయాలని సంకల్పించాం. ఇప్పుడు ఇది మెరుగ్గా పనిచేస్తోంది."
-రోజర్ వియెన్స్, సూపర్‌క్యామ్ ప్రధాన సృష్టికర్త.
మార్స్ రోవర్ ల్యాండ్ అయిన మొదటి 18 గంటల తర్వాత అంగారక గ్రహంపై గాలి శబ్దాలు రికార్డు అయినట్లు మొదటి ఆడియో ఫైల్లో తెలుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలి శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. లేజర్ సాంకేతికతతో పనిచేసే ఈ సూపర్‌క్యామ్‌ను ఇతర గ్రహంపై ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.