కరోనాపై పోరాటంలో భారత్‌కు అండగా నిలిచేందుకు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసిన గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ పాండమిక్ రెస్పాన్స్‌లో ముగ్గురు దిగ్గజ సంస్థల సీఈఓలు భాగస్వాములయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈఓ పునీత్ రెంజెన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌లు టాస్క్‌ఫోర్స్ స్టీరింగ్ కమిటీలో చేరారు. వీరంతా భారతీయ అమెరికన్లే కావడం విశేషం. ఇప్పటికే వీరంతా భారత్‌లో పలు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బిల్ & మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మన్, బిజినెస్ రౌండ్‌టేబుల్ సీఈఓ జోషువా బోల్టెన్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ సుజెన్ క్లార్క్‌లు సైతం టాస్క్‌ఫోర్స్‌లో భాగస్వాములయ్యారు.
ఏంటీ టాస్క్‌ఫోర్స్?
అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆధారంగా దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. బిజినెస్ రౌండ్‌టేబుల్ అనే స్వచ్ఛంద సంస్థ దీనికి సహకారం అందిస్తోంది. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరంతో కలిసి ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది. భారత్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకునే విధంగా సత్వర చర్యలు చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం.
భారత్‌కు 25 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెయ్యి వెంటిలేటర్లు అందించాలని అమెరికా కార్పొరేట్ సంస్థలు నిర్ణయించాయి. ఇందులో డెలాయిట్ పంపిన వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఏప్రిల్ 25న భారత్‌కు చేరుకున్నాయి. వీటి రవాణాలో ఫెడ్ఎక్స్ సహకరించింది. 16 వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. ఇవన్నీ కలిసి 30 మిలియన్ డాలర్ల సహాయాన్ని భారత్‌కు అందించనున్నాయి.
వీరితో పాటు యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్, అమెజాన్ సీఈఓ ఆండీ జాసీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ తదితరులు స్టీరింగ్ కమిటీలో ఉన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ టీకాపై అవగాహన కల్పించే 'భారీ విమానం'!