కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఆధారిత కాలుష్యం భారీగా తగ్గినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ఏప్రిల్‌లో పూర్తి స్థాయి లాక్డౌన్ ఉన్న కారణంగా.. అత్యధికంగా 17 శాతం కర్బన ఉద్గారాలు తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు.
గరిష్ఠంగా 7 శాతం..
కరోనాతో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైన వేళ కర్బన ఉద్గారాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం లెక్కించింది. 2019తో పోలిస్తే ఈ ఏడాదిలో 4 నుంచి 7 శాతం తక్కువ కాలుష్యం నమోదవుతుందని అంచనా వేసింది.
ఏడాది మొత్తం కఠిన లాక్డౌన్ కొనసాగితే 7 శాతం, ఆంక్షలు త్వరగా ఎత్తివేస్తే 4 శాతం తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద తగ్గుదలగా నిలుస్తుందని చెబుతున్నారు.
వివిధ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏప్రిల్4- 9 తేదీల మధ్య భారీగా కాలుష్య స్థాయి తగ్గినట్లు గుర్తించారు. రోజుకు 1.87 కోట్ల టన్నులు కర్బన ఉద్గారాలు తగ్గాయని తెలిపారు.
ఉద్గారాలను అధికంగా విడుదల చేసే దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంది. నేచర్ క్లైమేట్ ఛేంజ్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఆధారంగా ఫిబ్రవరిలో 25 శాతం చైనాలో కర్బన కాలుష్యం తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు.
భారత్‌లో 26 శాతం, ఐరోపాలో 27 శాతం కర్బర ఉద్గారాలు తగ్గాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్లో 40 శాతానికిపైగా తక్కువ స్థాయిలో ఉద్గారాలు వెలువడ్డాయి.
మళ్లీ సాధారణ స్థితికి..
అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ ప్రభావం అంతంతమాత్రమేనని పరిశోధకులు చెబుతున్నారు. మళ్లీ ఉద్గార వాయువుల స్థాయి పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 30 నుంచి రోజుకు 33 లక్షల టన్నుల ఉద్గారాలు పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇలాగే పెరిగితే గత నెలలో తగ్గిన ప్రభావం వాతావరణ మార్పులపై ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
"బకెట్‌ను నీటితో నింపే సమయంలో ఒక 10 సెకన్లు కులాయి ఆపితే ఏమవుతుంది? వాతావరణ మార్పుల విషయానికి వస్తే ఈ తగ్గుదల చాలా చిన్న పరిణామం. సముద్రంలో నీటి బిందువుతో సమానం."
-కారిన్ లీక్వెరీ, పరిశోధకురాలు