ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారికి సరైన చికిత్సను కనుగొనేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వేళ అమెరికాలోని రెండు ఆస్పత్రుల వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. శ్వాసకోశ వ్యవస్థ విఫలమైనప్పుడు చేసే చికిత్సను ఆరోగ్యం విషమించిన కరోనా రోగులకు అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.
అమెరికా బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బెత్ ఇస్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ వైద్యులు కరోనా రోగుల వివరాలను పరిశీలించారు. ఆరోగ్యం విషమించి వెంటిలేటర్లపై చికిత్స తీసుకున్న 66 మంది రోగుల రికార్డులను అధ్యయనం చేశారు. ప్రాణాంతక అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్(ఏఆర్డీఎస్) కారణంగానే రోగులు తీవ్రంగా ప్రభావితమవున్నట్లు గుర్తించారు. దీని ద్వారానే ఊపిరితిత్తులు ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు నిర్ధరణకు వచ్చారు.