తెలంగాణ

telangana

ETV Bharat / international

పీరియడ్స్‌పై వ్యాక్సిన్ల ప్రభావం ఉంటుందా..?

Vaccination Impact on Women's Periods : రుతుక్రమంపై వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అమెరికాలోని 4వేల మంది మహిళలపై అధ్యయనం జరిపారు. ఇందుకోసం అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి పొందిన బర్త్‌ కంట్రోల్‌ యాప్‌ సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దాదాపు ఆరు నెలసరి సమయాల్లో వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.

covid shots womens periods
పీరియడ్స్​పై వ్యాక్సిన్​ ప్రభావం

By

Published : Jan 8, 2022, 3:25 PM IST

Vaccination Impact on Women's Periods : కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనాను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్‌లు సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలినప్పటికీ వీటివల్ల ఏమైనా దుష్పరిణామాలు ఎదురవుతాయా అనే ఆందోళన, అనుమానాలు ఇప్పటికీ కొందరిలో వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల పీరియడ్స్​పై (రుతుక్రమం) కరోనా వ్యాక్సిన్‌లు ఏవిధమైన ప్రభావం చూపుతాయనే ప్రశ్నలూ కొందరి మదిలో తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అంశంపై తొలిసారి ఓ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళల్లో కేవలం స్వల్ప, తాత్కాలిక మార్పులు మాత్రమే కలుగుతాయని వెల్లడైంది. అవి కూడా కొన్ని రోజుల్లోనూ సాధారణ స్థితికి వస్తున్నట్లు తేలింది.

ఒకరోజు మాత్రమే ఆలస్యం..

రుతుక్రమంపై వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అమెరికాలోని 4వేల మంది మహిళలపై అధ్యయనం జరిపారు. ఇందుకోసం అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి పొందిన బర్త్‌ కంట్రోల్‌ యాప్‌ సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దాదాపు ఆరు నెలసరి సమయాల్లో వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. తద్వారా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మరుసటి నెలసరి ఒకరోజు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తించారు. అయితే, రుతుస్రావం విషయంలో మాత్రం ఎటువంటి తేడా లేదని గుర్తించారు. సాధారణంగా ఎన్ని రోజులు వస్తుందో.. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా అదే మాదిరిగా ఉందని కనుగొన్నారు. కేవలం కొందరి మహిళల్లో మాత్రమే పీరియడ్స్‌ క్రమంలో మార్పులు గమనించామని పరిశోధకులు వెల్లడించారు. ఇటువంటి సమస్యలు సాధారణమేనని.. ఒత్తిడి, ఆహారం, వ్యాయామం వంటి ఇటువంటి తాత్కాలిక మార్పులకు దారితీస్తాయని స్పష్టం చేశారు.

మహిళలకు భరోసా..

అధ్యయంనంలో భాగంగా సాధారణ పీరియడ్స్‌ ఉండే మహిళలనే పరిగణనలోకి తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వీరిలో మార్పులను పరీక్షించి.. వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోల్చి చూశారు. రెండు డోసులు తీసుకున్న 538 మంది మహిళల్లోనే సాధారణం కంటే రెండు రోజుల ఆలస్యంగా పీరియడ్స్‌ మొదలైనట్లు గుర్తించారు. వారిలో 10శాతం మందిలోనే ఎనిమిది రోజులు ఆలస్యంగా వచ్చినట్లు కనుగొన్నారు. అయితే, ఈ మార్పులు కొన్ని రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.

ఇది మహిళలకు నిజంగా భరోసా ఇచ్చే విషయమేని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఓరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ నిపుణురాలు డాక్టర్‌ ఎలిసన్‌ ఎడెల్‌మన్‌ పేర్కొన్నారు. రోగనిరోధక వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు రుతుచక్రంలోనూ ఇటువంటి మార్పులు సహజమేనన్నారు. పీరియడ్స్‌పై వ్యాక్సిన్‌ల ప్రభావం అతి స్వల్పం, తాత్కాలికమే అనడానికి తాజా అధ్యయనం దోహదం చేస్తుందని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌కు చెందిన డాక్టర్‌ క్రిస్టోఫర్‌ ఝాన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'కొవిడ్​ తదుపరి వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం కావొచ్చు!'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details