మహమ్మారి కరోనా తీవ్ర హృద్రోగ సమస్యలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టి గుండెపోటుకు కారణమవుతోందని తెలిపారు. ప్రస్తుతం కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధాలు.. గుండె సంబంధ రోగాలకు తెరతీస్తున్నాయని అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలను అమెరికా జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసన్లో ప్రచురితమయ్యాయి.
గుండెపైనా శ్రద్ధ అవసరం..
వైరస్ బాధితులను కాపాడటమే లక్ష్యంగా అత్యవసర వైద్యంలో పలు ఔషధాలు ఉపయోగిస్తున్నారు. అయితే రోగుల శ్వాస సమస్యపైనే వైద్యులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని... కాగా గుండె సమస్యలపై శ్రద్ధ చూపకపోవడమే వైరస్ రోగుల మరణానికి దారితీస్తోందని పరిశోధకులు గుర్తించారు.
"మానవ శరీరంపై వైరస్ ఎంతమేరకు, ఎటువంటి ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవడానికి మేము ఎక్కువమంది రోగులను పరిశీలించాం. పరిశోధనల్లో ప్రత్యేకంగా గుండె వ్యవస్థపైనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాం." -విలియం బ్రాడే, వర్జినీయా విశ్వవిద్యాలయం పరిశోధకులు