కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది మంది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులకు ఊరట కలిస్తూ అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వీసాల గడువును మరికొంత కాలం పొడిగించేందుకు... కేసుల ప్రాతిపదికన ప్రత్యేక పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించింది.
వ్యాపారం లేదా పర్యటనలకు కోసం వెళ్లేవారికి బి-1, బి-2 వీసాలు; విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు, పరిశోధకులు, వైద్యులు లాంటి వారికి జె-1 వీసాలు, ఐటీ నిపుణులకు హెచ్1బీ వీసాలు, (ఇంట్రా కంపెనీ ట్రాన్సఫరీస్) ఎగ్జిక్యూటివ్ హోదా కలిగిన ఉద్యోగులకు ఎల్-1 వీసాలు మంజూరు చేస్తారు. వీరంతా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులే అవుతారు.
దరఖాస్తు చేసుకోవాల్సిందే..
గడువు పొడిగింపు కోరుకునే వారు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరముందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది. అన్ని హెచ్1బీ వీసాల గడువును ప్రత్యేకంగా పొడిగించేది లేదని స్పష్టం చేసింది.