"ఎవరు వాళ్లు..? ఫ్యాన్స్.. నా డై హార్డ్ ఫ్యాన్స్.." ఇది ఓ చిత్రంలో డైలాగ్. అయితే ఈ సంభాషణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సరిగ్గా సరిపోతోంది. ఇందుకు చాలానే కారణాలున్నాయి.
'అమెరికా ఫస్ట్' నుంచి 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' వరకు... ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాట ఏదైనా ఆయన అభిమానులకు అది శిరోధార్యం. ఎందుకంటే అధ్యక్ష పదవిలో ఓడిపోయి.. ఎన్నికల తీరు, ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ట్రంప్ అభిమానులు ఆయన్ను ఏనాడు వదల్లేదు. "గెలుపైనా, ఓటమైనా ట్రంప్‌తోనే" అన్నట్లు ఆయన వెంటే నిలిచారు. ప్రస్తుతం బైడెన్‌కు సవాళ్ల సవారీతో శ్వేతసౌధానికి స్వాగతం పలకబోతోన్న ట్రంప్‌ను తిరిగి 2024లో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన అభిమానులు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
- ఇదీ చూడండి:ఓడింది ట్రంప్ మాత్రమే.. 'ట్రంపిజం' కాదు!
బైడెన్‌కు సవాల్..
ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే సోషల్ మీడియాలో బైడెన్‌పై ట్రంప్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. ట్రంప్‌పై బైెడెన్ విజయం చట్టవిరుద్ధమంటూ నానా హడావుడి చేశారు. అయితే ట్రంప్ న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్లు అన్నీ వీగిపోవడం వల్ల చేసేదేమీ లేక ఇప్పుడు బైడెన్ అధికారంలోకి వచ్చాక విమర్శలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనే మెరుగ్గా ఉందనేలా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ట్రంప్‌కు సాధ్యమా..?
2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ బరిలోకి దిగాలని అనుకుంటే ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే, రిపబ్లికన్ పార్టీలో తన అవకాశాలను కోల్పోకుండా చూసుకోవాలి. ఇప్పటివరకు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు తిరుగులేని పరిస్థితి. ఓడిపోయినా ప్రజల్లోనూ ఆయనకు బలమైన మద్దతుందనే సంగతి ఈ ఎన్నికల్లో రుజువైంది. 2024లో ట్రంప్ 78 ఏళ్ల వయసుకొస్తారు. అదేమీ అనర్హత కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఎంపికైన బైడెన్‌కు ఇప్పుడు అదే వయసు.
"ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అంటే అది ట్రంప్ పార్టీ అనే ఆలోచనే వస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలనే పార్టీ అనుసరిస్తుంది. 2024లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలబడే కొత్త వ్యక్తులకు ట్రంప్ నుంచి గట్టి పోటీ ఉంటుంది."