అమెరికాలో కరోనా అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. యూనివర్సిటీలు సహా అన్నింటిని మూసివేసింది. ఈ కారణంగా అక్కడి భారత విద్యార్థులు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలోని 500 మంది విద్యార్థులతో అమెరికాలోని భారత రాయబార ప్రతినిధి తరణ్జిత్ సింగ్ సంధు ఇన్స్టాగ్రామ్లో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కిడివారు అక్కడే ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ అందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అమెరికా అధికారులతో తరచూ సంప్రదింపులు జరిపి సాయం అందించాలని కోరుతున్నట్లు చెప్పారు.
అమెరికాలో దాదాపు 2,50,000 మంది భారత విద్యార్థులు ఉన్నారని అంచనా. కరోనా వ్యాప్తి కారణంగా యూనివర్సిటీలు, హాస్టళ్లు మూసివేసి అందరినీ ఇంటికి వెళ్లమని అక్కడి ప్రభుత్వం అదేశించింది. అకస్మాతు చర్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక వందాలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు సాధారణమయ్యాక అందరినీ స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని తరణ్జిత్ సింగ్ భరోసా ఇచ్చారు.