15 గంటల హైడ్రామా : కాల్పుల్లో ముగ్గురు హతం అమెరికాలోని మాంచెస్టర్‌లో ఓ హైడ్రామా జరిగి చివరకు కాల్పులకు దారితీసింది. ఘటనలో ముగ్గురు మృతిచెందారు. న్యూ హాంప్‌షైర్‌లోని ఓ హోటల్లో బుధవారం మొదలైన ఈ ఘటనతో 15 గంటలపాటు ప్రతిష్టంభన నెలకొంది.
ఇలా జరిగింది...
మాంచెస్టర్‌లో బుధవారం మార్షెల్ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసులు న్యూ హాంప్‌షైర్ హోటల్‌కు వెళ్లారు. మాదకద్రవ్యాలకు సంబంధించి మార్షెల్కు 10ఏళ్ల నేర చరిత్ర ఉంది. పోలీసులను గుర్తించిన మార్షెల్ వెంటనే హోటల్ కిటికీ నుంచి దూకి రోడ్డు మీద పరిగెత్తాడు. తన వద్దనున్న తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపాడు. అతడిని వెంటనే పోలీసులు కాల్చి చంపేశారు.
మార్షల్‌ను కాల్చేసిన అనంతరం 'స్వాట్ బృందం' రంగంలోకి దిగింది. హోటల్ పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి హోటల్లో ఉన్న 250 మందిని అధికారులు ఒక్కొక్కరిని ఐదుగురు చొప్పున భద్రతావలయం ఏర్పరచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
హోటల్ గదిలో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. గది మూసివేసి ఉండటం వల్ల లోపలికి వెళ్లలేకపోయారు. వీరిలో ఒకరు లోపలి నుంచి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. స్వాట్ బృందం గదిలోకి రసాయనాలను వదిలింది. చివరకు గది తెరిచేసరికి ఇద్దరు మరణించి కనిపించారు. వీరిలో ఒకరు మహిళ. వారి మృతికి కారణాలను పోలీసులు వెల్లడించలేదు.
ఈ హైడ్రామా అంతా ముగిసే సరికి 15 గంటలు పట్టింది. పూర్తి ఘటనపై అటార్ని జనరల్ ఆదేశాల మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.