ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌ను ప్రపంచ పౌరసత్వ రాయబారిగా గుర్తించింది అమెరికాకు చెందిన 'ఈశాన్య విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక కేంద్రం'. మానవతావాదిగా, శాంతిస్థాపకుడిగా, ఆధ్యాత్మిక బోధకుడిగా ఆయన చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది.
ప్రపంచ పౌరసత్వ రాయబారిగా శ్రీ శ్రీ రవిశంకర్ - ఈశాన్య విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక కేంద్రం
ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌ను ప్రపంచ పౌరసత్వ రాయబారిగా గుర్తించింది అమెరికాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం. ప్రసంగాలు, వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా శాంతిని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారని కొనియాడింది. అనేక దేశాల్లో సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపింది.
ప్రసంగాలు, వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా శ్రీ శ్రీ రవిశంకర్ శాంతిని పెంపొందించారని యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలు, మానవతా సంస్థలను సమన్వయం చేశారని తెలిపింది. అఫ్గానిస్థాన్, బ్రెజిల్, కామెరూన్, కొలంబియా, ఇండియా, ఇండోనేసియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా, కెన్యా, కొసోవో, లెబనాన్, మారిషస్, మొరాకో, నేపాల్, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అమెరికా సహా పలు దేశాల్లో అనేక సంఘర్షణలకు పరిష్కారం కనుక్కోవడంలో కీలకంగా వ్యవహరించారని తెలిపింది.
అనుభవపూర్వక విద్య, పరిశోధనలకు ఈ విశ్వవిద్యాలయం ప్రఖ్యాతి గాంచింది. 100 దేశాలకు పైగా విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. అమెరికాలోని ఉత్తమ 50 యూనివర్సిటీలలో ఇది ఒకటి. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో మూడో అతిపెద్దది.