అమెరికా క్యాపిటల్ భవనంలో బుధవారం చెలరేగిన హింసకు అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఆయన ఖాతాపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం కూడా ట్రంప్ ఖాతాలపై తాత్కాలిక ఆంక్షలకు ఉపక్రమించాయి. దీంతో సరికొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించాలని ట్రంప్ భావిస్తున్నారు. మార్కెట్లో ఆదరణ చూరగొన్న కొత్త ప్లాట్‌ఫాంలపైనా ఆయన ఆసక్తి చూపుతున్నారు.
రెండేళ్ల క్రితం సేవలు ప్రారంభించి, యూజర్లను ఆకట్టుకుంటున్న పార్లర్ సామాజిక మాధ్యమాన్ని ట్రంప్ ఎంచుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. పార్లర్లో ఇప్పటికే ట్రంప్ కుమారులు ఎరిక్, జూనియర్ ట్రంప్ యక్టివ్‌గా ఉన్నారు. 2018లో ప్రారంభమైన ఈ యాప్‌ను దాదాపు 1.2కోట్ల మంది వినియోగిస్తున్నారు.
" మేము చాలా వెబ్సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నాము. దీనిపై త్వరలో కీలక ప్రకటన చేస్తాం. భవిష్యత్తులో సరికొత్త ప్లాట్‌ఫాంను ప్రారంభించే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
పార్లర్పైనా ఆంక్షలు
అయితే పార్లర్ యాప్‌ను గూగుల్, యాపిల్ సంస్థలు ప్లే స్టోర్ల నుంచి తొలగించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ప్రజా భద్రత సమస్యను పరిష్కరిస్తేనే రీస్టోర్ చేస్తామని చెప్పాయి. ఆ మరునాడే అమెజాన్ కూడా పార్లర్‌కు షాక్ ఇచ్చింది. తాము అందిస్తున్న వెబ్ సర్వీసెస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పార్లర్ వారం రోజుల పాటు ఆఫ్‌లైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి తెలెత్తింది.