కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు వీధులు, మార్కెట్లు, రహదారులపై క్రిమిసంహారక రసాయనాలు పిచికారీ చేస్తున్నాయి. మనుషులపైనా వాటిని ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. క్రిమిసంహారకాలు చల్లినా కరోనా చావకపోగా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓ ప్రకటన విడుదల చేసింది.
" వీధులు, మార్కెట్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్-19 లేదా ఇతర వ్యాధికారక క్రిములను చంపడానికి క్రిమిసంహారకాలు చల్లడం, పొగ వేయటం అనేవి శాస్త్రీయంగా సిఫార్సు చేసిన పద్ధతులు కాదు. అలా చేసినా.. దుమ్ము, దూళి, చెత్తాచెదారం కారణంగా అవి పనిచేయవు. వీధులు, రోడ్లను కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రదేశాలుగా పరిగణించలేదు. బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారకాలు చల్లటం మనుషుల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్షణ లేకుండా ఒక్కరే వాటిని పిచికారీ చేయకూడదు. ఈ పద్ధతి శారీరకంగా, మానసికంగా హానికరం. వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు సంక్రమించే సామర్థ్యాన్ని ఇది తగ్గించదు."