తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా కట్టడికి ట్రంప్​ అత్యవసర చర్యలు చేపట్టాలి'

అమెరికాలో కరోనా నియంత్రణకు అత్యవసర చర్యలు చేపట్టాలని ట్రంప్​ ప్రభుత్వానికి సూచించారు జో బైడెన్​. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అయితే దేశంలో మరోమారు లాక్​డౌన్​​ అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు డొనాల్డ్​ ట్రంప్​.

COVID-19 cases in america
అమెరికాలో కరోనా విజృంభణ.. అత్యవసర చర్యలు చేపట్టాలి

By

Published : Nov 14, 2020, 11:38 AM IST

అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అగ్రరాజ్యం అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్​. సత్వర చర్యలు చేపట్టాలని ట్రంప్ ప్రభుత్వానికి సూచనలు చేశారు.

కొన్నిరోజులుగా అమెరికాలో కొవిడ్​-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కొవిడ్​ టాస్క్​ఫోర్స్​తో సమావేశమయ్యారు బైడెన్​.

"దేశవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా విషయంలో ప్రభుత్వం చెబుతున్న వివరాలు చూస్తుంటే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నేను అధ్యక్షుడుగా ఎన్నికయ్యాను. కానీ వచ్చే ఏడాది వరకు నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేను. ఇంతలోనే మహమ్మారి సంక్షోభం తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అత్యవసర చర్యలు చేపట్టాలి."

-- జో బైడెన్, అధ్యక్ష ఎన్నికల విజేత​.

"ఫ్రంట్​లైన్​ వర్కర్లు పీపీఈ కిట్ల కొరత ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రుల్లో బెడ్​లు నిండిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు, ప్రాంతాలు, కమ్యూనిటీలు, స్కూళ్లు, బిజినెస్​ ప్రాంతాల్లో ప్రత్యేక విధివిధానాలు అమలు చేయాలి. ప్రతి ఒక్కరు భౌతిక దూరం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం ద్వారా స్వీయ జాగ్రత్త చర్యలు పాటించాలి. మరోవైపు వ్యాక్సిన్​ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విభిన్న కరోనా చికిత్సలతో సత్ఫలితాలు వస్తున్నాయి. టెస్టింగ్​ సామర్థ్యం పెంచుకున్నాం. ఈ పరిస్థితులను అధిగమించి బలంగా తిరిగివస్తాం" అని బైడెన్​ అన్నారు.

'లాక్​డౌన్​ ప్రసక్తే లేదు..'

కరోనా వ్యాప్తి నివారణకు అమెరికాలో మరోసారి లాక్‌డౌన్‌ తీసుకొచ్చే ప్రసక్తే లేదని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. వైరస్‌ను అడ్డుకునేందుకు తీసుకునే నిర్ణయాలు సమస్యను మరింత జటిలం చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ వల్ల రోజుకు 50 బిలియన్‌ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉందని, వేలాది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్‌ తెలిపారు. తమ ప్రభుత్వం అయితే మరోసారి లౌక్‌డౌన్‌ను అమలుచేసే ఆలోచనలో లేదని స్పష్టం చేశారు.

గత కొన్ని రోజులుగా సురక్షితమైన, సమర్థవంతమైన టీకా పురోగతిపై వార్తలు సానుకూలంగా వస్తున్నాయి. ఫార్మా కంపెనీ పీఫైజర్​ తమ వ్యాక్సిన్​ 90 శాతం సురక్షితమని ప్రకటించింది. ఒకవేళ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా విస్తృతంగా వ్యాక్సినేషన్​​ చేయడానికి నెలల సమయం పడుతుంది.

అగ్రరాజ్యాన్ని వణికించిన కరోనా రెండోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే అమెరికాలో కోటి మందికి పైగా కరోనా బారిన పడగా.. 2,44,302 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details