Spider Man Comics: స్పైడర్‌మ్యాన్.. ఈ పాత్రకు ఉండే క్రేజే వేరు. మార్వెల్ సంస్థ సృష్టించిన ఈ సూపర్ క్యారెక్టర్‌కు పిల్లలు, యువత మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఇటీవల విడుదలైన 'స్పైడర్ మ్యాన్- నో వే హోమ్' చిత్రానికి కాసుల వర్షం కురిసింది. ఇది ఇక్కడితో ఆగలేదు. తాజాగా అమెరికాలోని డాలస్‌లో నిర్వహించిన కామిక్ బుక్స్ వేలంలో కూడా స్పైడర్‌మ్యాన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఒక్క పేజ్ రూ.24 కోట్లు!
1984 సంవత్సరానికి చెందిన ఓ స్పైడర్‌మ్యాన్ కామిక్ పేజ్ వేలంలో రూ. 24.89 కోట్లకు అమ్ముడుపోయింది. పలు స్పైడర్‌మ్యాన్ చిత్రాల్లో కనిపించే బ్లాక్సూట్ స్పైడీ పాత్ర ఈ కామిక్ పేజ్ ద్వారానే అభిమానులకు పరిచయం అయింది. ఈ సింబయోట్ సూట్ నుంచే వెనమ్ పాత్రను అభివృద్ధి చేశారు రచయితలు. అందుకే ఈ కామిక్ పేజ్ అంటే అభిమానులకు అంత క్రేజ్. రూ. 2 కోట్ల వద్ద ప్రారంభమైన ఈ పేజ్ వేలం.. రూ.24.89 కోట్ల వరకు వెళ్లింది.