కమలా హారిస్.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. అమెరికా అధక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన హారిస్ ఉపాధ్యక్షురాలిగా గెలవడమే. ఈ పదవికి పోటీ చేసి.. గెలిచిన తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ హారిస్ కావడం విశేషం.
ఆసియా- ఆఫ్రికా మూలాలు..
కమలా హారిస్... తల్లిదండ్రులిద్దరూ అమెరికాకు వలస వెళ్లినవాళ్లే. ఆఫ్రికా మూలాలున్న తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకా నుంచి వెళ్లారు. తల్లి శ్యామలా గోపాలన్ ఇండియా నుంచి 1958లో వలస వెళ్లారు. శ్యామల దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈమె తండ్రి గోపాలన్ భారత్‌లో దౌత్యాధికారి. చెన్నైలోని వీరింట్లో తరచూ అవినీతి అరికట్టడంపైనా, రాజకీయాలపైనా చర్చలు జరిగేవి. తాతతోనూ కమలకి మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు చెన్నైలోని తాతయ్య ఇంటికి వచ్చారు. అమెరికా నుంచి ఆయనకు ఉత్తరాలూ రాసేవారు.
ఓక్లాండ్లో జననం..
కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. బెర్క్లీలో పెరిగారు. హోవార్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. కమల విద్యాభ్యాసం అనంతరం న్యాయవాద వృత్తిని చేపట్టి 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా అయ్యారు. ఈ హోదాలో పనిచేసిన మొదటి మహిళ కమలానే. అంతేకాదు మొదటి ఆఫ్రికన్-అమెరికన్, భారత మూలాలున్న వ్యక్తి కూడా. అమెరికాలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రమైన కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్‌గా 2011-2016 మధ్య పనిచేశారు. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీలో భవిష్యత్తు నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
2017లో సెనేట్‌లో అడుగుపెట్టిన కమల అక్కడ ఇంటెలిజెన్స్, జ్యుడిషియరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. అమెరికాలో అందరికీ సమానావకాశాలు దక్కాలని మొదట్నుంచీ తన వాణి వినిపిస్తున్నారు కమల. నల్లజాతీయుల సమస్యలూ, దక్షిణాసియా వాసుల ఇబ్బందులూ, వలసదారుల కష్టాలూ తెలిసిన వ్యక్తిగా కమలాకు రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. మహిళలూ, అల్పాదాయ వర్గాల ప్రతినిధిగానూ పేరుంది. న్యాయవాది, ఇద్దరు పిల్లల తండ్రి అయిన డౌగ్లాస్ ఎమ్‌హాఫ్‌ను 2014లో పెళ్లిచేసుకున్నారు. ఆయన పిల్లల్ని తన పిల్లలుగానే భావిస్తూ వాళ్లతో ప్రేమానురాగాలు పంచుకుంటారు కమల.