అమెరికాకు చెందిన ప్రైవేటు రోదసీ పరిశోధన సంస్థ స్పెస్ఎక్స్... 'డ్రాగన్' అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. కేప్ కెనవెరల్ నుంచి బయలుదేరిన 3 రోజులకు 40 'బాహుబలి' ఎలుకలు, 1 లక్ష 20 వేల పురుగులు, కీటకాలు, ఓ రోబోతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకుంది 'డ్రాగన్'. ఐఎస్ఎస్లో ఉండే వ్యోమగాముల కోసం కొన్ని క్రిస్మస్ బహుమతులనూ తీసుకెళ్లింది.
మొత్తం 2 వేల 720 కిలోలు బరువైన సామగ్రితో వెళ్లిన డ్రాగన్... సముద్ర మట్టానికి 420 కిలోమీటర్ల ఎత్తున ఐఎస్ఎస్కు సమాంతరంగా ఆగింది. వాహకనౌకలోని ఎలుకలు, పురుగులు, ఇతర వస్తువులను ఐఎస్ఎస్ సిబ్బంది ఓ రోబో సాయంతో అందుకున్నారు.
ఎలుకలు, పురుగులు ఎందుకు?
అంతరిక్షంలో వ్యవసాయ సంబంధిత ప్రయోగాలు చేసేందుకు 1,20,000 కీటకాలను తీసుకెళ్లింది డ్రాగన్. అంతరిక్ష వాతావరణంలో శక్తిమంతమైన ఎలుకలను విడిచి కొన్ని ప్రయోగాలు చేయనుంది అమెరికా. అందులో 8 ఎలుకలను జెనిటిక్ ఇంజినీరింగ్ ద్వారా సృష్టించారు. మిగిలినవాటితో పోల్చితే బలిష్ఠంగా ఉండే వీటిని బాహుబలి ఎలుకలు అంటున్నారు.