ఒక పక్క కొవిడ్ సెకండ్ వేవ్ ప్రళయం సృష్టించి ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది.. మరోపక్క థర్డ్ వేవ్ కొన్ని నెలల్లోనే పడగ విప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగపూర్ వంటి చోట్ల ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేసే అస్త్రం టీకా మాత్రమే. భారత్ పరిస్థితి చూస్తే మరికొన్ని నెలల పాటు టీకా ఉత్పత్తిలో పురోగతి కనిపించే అవకాశం లేదు. అమెరికా వద్ద గోదాముల్లో పడి వున్న ఆరు కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు భారత్‌కే వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో మరిన్ని టీకా కంపెనీలను దేశంలోకి రప్పించే ప్రయత్నాలు అనుకున్నంత వేగంగా జరగడంలేదు.
ఇప్పటి వరకు రష్యాకు చెందిన స్పుత్నిక్-వి మాత్రమే భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికైతే అత్యవసర వినియోగానికి డోసులు దిగుమతి చేసుకుంటున్నారు. త్వరలోనే దేశీయంగా తయారైన డోసులు అందుబాటులోకి రానున్నాయి. సార్స్‌కోవ్-2 వైరస్‌పై అత్యధిక ప్రభావం చూపిస్తున్న అమెరికా కంపెనీల టీకాల విషయం ఇంకా తేలలేదు. "ప్రభుత్వం 2020 మధ్య నుంచే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నాలతో చర్చలు జరుపుతోంది" ఇది నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ 'భారత వ్యాక్సినేషన్‌పై అవాస్తవాలు.. వాస్తవాలు' అనే ప్రకటనలో పేర్కొన్న అంశం. వీటిల్లో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా మాత్రమే భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. దీనిపై హెల్త్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ "ఫైజర్, మోడెర్నాలకు రెగ్యూలేషన్ విషయాల్లో సహకరిస్తామని చెప్పాం. కొనుగోలు అంశాల్లో కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. వారి వద్ద అదనంగా ఉన్న టీకాలను తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం" అని వెల్లడించారు.
అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ వంటి దేశాల్లో కనీసం 50 శాతం మందికి ఒక్క డోసు టీకా పడటంతో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. భారత్‌లో 130 కోట్ల మందిలో 50శాతం మందికి ఒక్క టీకా పడాలన్నా కనీసం 75 కోట్లు ఉత్పత్తి కావాలి. రెండు డోసులు అంటే 140 కోట్లు అవసరం. డిసెంబర్ నాటికి 216 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ వంటి వారు ప్రభుత్వ లెక్కలపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట కొనగోళ్లు ప్రభుత్వాలకు తప్పనిసరి.
ఫైజర్‌తో చర్చల్లో చిక్కుముడి ఇది..
కొవిడ్‌పై అత్యధిక సామర్థ్యం చూపిస్తున్న టీకా ఇది. దీనిని మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది పూర్తిగా కొత్తది. భారత్‌లో 5 కోట్ల డోసులు సరఫరా చేయడానికి ఈ సంస్థ సానుకూలంగానే ఉంది. కానీ, పలు సాంకేతిక, వాణిజ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. కొన్ని నెలల నుంచి వీటిపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. వీటిల్లో అత్యంత కీలకమైనది ఇండెమ్నిటి సమస్య.
తేలని ఇండెమ్నిటి..
ఫైజర్ భారత్‌కు టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారల అంశాలు వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతోంది. భారత ప్రభుత్వం దీనికి కొంత వరకు మాత్రమే హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తొలుత పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవడానికి విముఖంగా ఉంది. సాధారణంగా టీకాలను విడుదల చేయడానికి ఏళ్లు పడతాయి. ప్రభుత్వాల ఒత్తిళ్ల కారణంగా హడావుడిగా టీకాలు విడుదల చేశారు. దీంతో ఏవైనా జరగకూడని ఘటనలు జరిగితే రక్షణ కోసం కోరుతోంది. పైగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కొత్తది. తాజా పరిణామాల నేపథ్యంలో డీల్‌కు అత్యంత దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అంశానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ 'నో ఫాల్ట్' పరిష్కారం చెప్పింది. కొవిడ్ వ్యాక్సిన్ల దుష్ఫ్రాభావాలు ఏమైనా ఉంటే బాధితులు కోర్టుకు వెళ్లకుండానే పరిహారం అందజేయాలని పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలు ఇండెమ్నిటి, నోఫాల్ట్ అంశాలకు ఒప్పుకొన్నాయి. వీటిల్లో అమెరికా, ఐరోపా సంఘం, కెనడా, జపాన్, అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి. గావీ కోవాక్స్ అలయన్స్ కూడా దీనికి అంగీకరించింది.