అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు నిర్వహించిన భద్రతా బలగాల్లో కరోనా కలవరం మొదలైంది. దాదాపు 200 మంది నేషనల్ గార్డ్స్ కొవిడ్ బారినపడినట్లు తేలింది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.
ఇటీవల అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో బైడెన్ ప్రమాణ స్వీకారానికి 26,000 మంది నేషనల్ గార్డ్స్ వాషింగ్టన్లో బందోబస్తులో పాల్గొన్నారు. వారిలో 15,000 మంది ఇప్పటికే వెనుదిరిగారు. మరో 3,600 మంది ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. మరో 7,000 మంది క్యాపిటల్ భద్రతా నిమిత్తం జనవరి నెల వరకు ఉండనున్నారు.
ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు నిర్వహించగా.. బౌతికదూరం వంటి కనీస జాగ్రత్తలు పాటించడానికి భద్రతా సిబ్బంది పాటించలేకపోయారని తెలుస్తోంది. కరోనా కలవరంతో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని సెనేట్ పార్కింగ్ గ్యారేజ్‌లో బస చేయాలని ఆదేశాలు అందాయి. అయితే.. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రాగా.. వారిని క్యాపిటల్‌కు తిరిగి ఆహ్వానించి, సమీప హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.