సూర్యుడి ఉత్తర, దక్షిణ ధ్రువాలను తొలిసారిగా చిత్రీకరించేందుకు అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ‘సోలార్ ఆర్బిటర్’ అనే వ్యోమనౌకను ప్రయోగించనున్నాయి. వచ్చే నెల 7న దీన్ని ప్రయోగించనున్నట్లు అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యుడి మధ్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని ‘ఎక్లిప్టిక్ ప్లేన్’గా పేర్కొంటారు. గ్రహాలన్నీ ఇందులోనే పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి వద్దకు ఇప్పటివరకూ ప్రయోగించిన వ్యోమనౌకలన్నీ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్‌లోనో.. దానికి దగ్గర్లోనో ఉన్నాయి. సోలార్ ఆర్బిటర్ మాత్రం దాన్ని దాటి వెళుతుంది. ఇందుకోసం శుక్రుడు, భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఎగువ నుంచి సూర్యుడిని పరిశీలించవచ్చని రస్సెల్ హోవర్డ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.
బుధ గ్రహాన్ని దాటి...
మన చుట్టూ ఉన్న వాతావరణంపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సౌర గోళం నుంచి ఆవేశిత రేణువులు దూసుకొస్తుంటాయి. వీటిని సౌర గాలిగా పేర్కొంటారు. ఒక్కోసారి విస్ఫోటంలా వచ్చే సౌర గాలులు భూమి ఎగువ వాతావరణ పొరలను తాకినప్పుడు అక్కడ సౌర తుపాన్లు చెలరేగుతుంటాయి. ఫలితంగా జీపీఎస్, కమ్యూనికేషన్ ఉపగ్రహాల పనితీరుపై ప్రభావం పడుతుంది. వ్యోమగాములకూ హాని కలగొచ్చు. అందువల్ల ఈ సౌర తుపాన్లకు సన్నద్ధమయ్యేందుకు శాస్త్రవేత్తలు సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎక్లిప్టిక్ ప్లేన్‌లో ఉంటూ ప్రస్తుత ఉపగ్రహాలు సాగిస్తున్న పరిశీలనల్లో కొన్ని లోపాలు ఉంటున్నాయి. అత్యంత కచ్చితత్వంతో అంచనాలు వేయాలంటే సూర్యుడి ధ్రువ ప్రాంతాలపై పరిశీలనలు చేపట్టాలని శాస్త్రవేత్తలు తెలిపారు. సోలార్ ఆర్బిటర్ ద్వారా అది సాధ్యమవుతుందని వివరించారు. ఇది బుధ గ్రహాన్ని దాటి వెళ్లి సూర్యుడిని నిశితంగా పరిశీలిస్తుందన్నారు.
ఇదీ చూడండి : చైనాలో కరోనా విలయతాండవం.. 131కి చేరిన మృతులు