తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాలు ప్రజలను చంపేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కరోనా టీకాలపై ఫేస్బుక్లో దుష్ప్రచారం జరుగుతోందని, దీనిపై స్పందించాలని శ్వేతసౌధంలో ఓ విలేకరి కోరగా.. ఇలా స్పందించారు. టీకా తీసుకోనివారిలోనే మహమ్మారి వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.
టీకాపై అసత్య వార్తలు ప్రచారం కావడం పట్ల అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురువారమే ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని 'ఇన్ఫోడెమిక్'గా అభివర్ణించారు. వ్యాక్సిన్ల వల్లే కరోనా అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే ఇంకెంతో కాలం వేచి చూడకుండా.. తామే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.