తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా నౌక సంచారంపై భారత్​ తీవ్ర అభ్యంతరం - లక్ష దీవుల సమీపంలో అమెరికా యుద్ధనౌక

భారత ప్రాదేశిక జలాల్లోని లక్షదీవుల సమీపంలో అమెరికా నౌకాదళం ఆపరేషన్​ నిర్వహించినట్లు పేర్కొంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆపరేషన్​ నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

USS john paul jones
అమెరికా యుద్ధనౌక సంచారంపై భారత్​ తీవ్ర అభ్యంతరం

By

Published : Apr 10, 2021, 5:07 AM IST

స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కును చాటేందుకే.. భారత ప్రాదేశిక జలాల్లోని లక్ష దీవులకు సమీపంలో తమ నౌకాదళం ఆపరేషన్‌ నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. భారత్‌ మితిమీరి కోరుతున్న సముద్ర ప్రాదేశిక హక్కులను సవాలు చేసేందుకు ఈ చర్యను చేపట్టినట్లు అగ్రరాజ్యం తెలిపింది. ఈ నెల 7న ఓ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపిన అమెరికా.. ఇందులో క్షిపణి ప్రయోగ సామర్థ్యమున్న విధ్వంసక నౌక యూఎస్​ఎస్​ జాన్‌ పాల్‌ జోన్స్‌ పాల్గొన్నట్లు పేర్కొంది. నౌకాయాన హక్కులు.. స్వేచ్ఛను చాటేందుకు ఈ యుద్ధ నౌక లక్షదీవులకు పశ్చిమాన 130నాటికన్‌ మైళ్ల దూరంలో భారత ప్రత్యేక ఆర్థిక మండలి గుండా ప్రయాణించినట్లు అమెరికా ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన అన్ని ప్రాంతాల్లో.. తమ బలగాలు, గగనవిహారం, నౌకాయానం, ఇతర కార్యకలాపాలు సాగించగలదని చాటేలా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అమెరికా తెలిపింది.

భారత్​ తీవ్ర అభ్యంతరం

మరోవైపు.. ప్రత్యేక ఆర్థిక జోన్‌-ఈఈజెడ్​లో అమెరికా యుద్ధనౌక ప్రవేశించటంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా నౌక జాన్‌పాల్ జోన్స్.. పర్షియన్ గల్ఫ్ నుంచి మలక్కా స్ట్రెయిట్స్ వైపు వస్తుండటాన్ని నిరంతరం పర్యవేక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ అభ్యంతరాలను రాయబార ఛానల్స్‌ ద్వారా అగ్రరాజ్యానికి తెలియజేసినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు వ్యోమగాములను పంపిన రష్యా

ABOUT THE AUTHOR

...view details