తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్‌లో విలయం.. ఆ దేశాలకు హెచ్చరిక' - భారత్ లో వ్యాక్సినేషన్

భారత్​లో కొవిడ్ కల్లోలం అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెచ్చరిక లాంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇంతవరకు కరోనా ప్రకోపాన్ని చూడని అల్ప, మధ్య ఆదాయ దేశాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

situation in india is a warning to low and middle income nations
'భారత్‌లో విలయం.. ఆ దేశాలకు హెచ్చరిక'

By

Published : May 23, 2021, 7:17 AM IST

భారత్‌లో సాగుతున్న కొవిడ్‌ రెండో విజృంభణ.. త్వరలో వర్ధమాన దేశాల్లో కరోనా వికృత రూపం దాల్చబోతోందనడానికి నిదర్శనం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. కరోనా తాకిడికి గురికాని ఆఫ్రికాఖండంలోని దేశాలు సహా అల్ప, మధ్యాదాయ దేశాలకు ఇది హెచ్చరిక అని తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాథ్‌, ఆర్థికవేత్త రుచిర్‌ అగర్వాల్‌లు ఓ నివేదికను వెలువరించారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి 35%కన్నా తక్కువ మందికే టీకా అందుతుందని చెప్పారు. నివేదికలోని ముఖ్యాంశాలివీ..

  • బ్రెజిల్‌ విజృంభణ తర్వాత భారత్‌లో కొవిడ్‌ రెండో ఉద్ధృతి చెలరేగడాన్ని బట్టి చూస్తే వర్ధమాన దేశాల్లో మున్ముందు కరోనా విశృంఖలంగా మారొచ్చని అర్థమవుతోంది.
  • మొదటి ఉద్ధృతిని భారత్‌లోని ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ బాగానే తట్టుకొంది. ఈసారి మాత్రం రోగుల సంఖ్య పెరగడంతో దీనిపై అమాంతం ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఆక్సిజన్‌, ఆసుపత్రి పడకలు, వైద్య పరిరక్షణ వంటివి దొరక్క అనేకమంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రస్తుతం భారత్‌ సాగిస్తున్న టీకా కొనుగోళ్లు, ‘కొవాక్స్‌’ కింద అందుతున్న వ్యాక్సిన్లను పరిగణనలోకి తీసుకుంటే 2022 ప్రథమార్ధం నాటికి దేశ జనాభాలో 25 శాతం మందికే వ్యాక్సిన్‌ అందుతుంది. అదనపు ఉత్పత్తి ద్వారా ఈ లోటును పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • 60 శాతం మందికి టీకా ఇవ్వాలంటే భారత్‌ అదనంగా దాదాపు 100 కోట్ల డోసులకు తక్షణం ఆర్డర్లు ఇవ్వాలి. టీకా కంపెనీలు అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన పెట్టుబడులకు రాయితీలు ఇవ్వడం, వ్యాక్సిన్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపరుచకోవడం ద్వారా వీటిని సాధించొచ్చు. ఈ దిశగా భారత ప్రభుత్వం టీకా కంపెనీలకు ఇటీవల దాదాపు 60 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం.
  • అయితే భారత అధికారులు మాత్రం ఈ ఏడాది చివరినాటికి 200 కోట్ల డోసులు లభ్యమవుతాయన్న అంచనాల్లో ఉన్నారు. దీన్ని సాధించాలంటే ఉత్పాదక సామర్థ్యం పెంపులో జాప్యం లేకుండా చూడాలి. ముడిపదార్థాల ఎగుమతుల్లో ఆంక్షల తొలగింపునకు అంతర్జాతీయ కసరత్తు జరగాలి.
  • టీకా ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలను అమెరికా సడలించినప్పటికీ భారత్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కీలక ముడిపదార్థాలకు ఇంకా కొరత ఉంది. దీన్నిబట్టి అమెరికా తన ఆంక్షలను మరింత సడలించాల్సి ఉందని స్పష్టమవుతోంది.
  • భారత్‌లో ప్రస్తుతం టీకా ఉత్పత్తిదారులు ఇవ్వజూపుతున్న ధరలు, దేశంలో యువ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 18-44 ఏళ్ల మధ్యవారికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి అదనంగా అయ్యే ఖర్చు.. జీడీపీలో 0.25 శాతంగానే ఉంటుంది. అందువల్ల కేంద్రీకృతంగానే ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలి.

ABOUT THE AUTHOR

...view details