కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు అమెరికాలోని భారతీయ సిక్కులు మద్దతు పలికారు. కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ఎదుట వందల సంఖ్యలో సిక్కులు నిరసనలు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను తొలగించాలని, ఇవి రైతులను పేదరికంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలతో కార్పొరేట్ సంస్థలకు భారత ప్రభుత్వం సర్వాధికారాలు కట్టబెట్టిందని ఆరోపించారు.
"ఏ దేశానికైనా రైతులే జీవనాధారం. మన జీవనాధారాన్ని మనమే కాపాడుకోవాలి. అమెరికావ్యాప్తంగా ఉన్న భారతీయులు ఇవాళ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు."
--గురిందర్ సింగ్ ఖల్సా, ఇండో-అమెరికన్.
అంతకు ముందురోజు వాషింగ్టన్ డీసీలోని భారత దౌత్యకార్యాలయం ఎదుట చికాగో రాష్ట్రానికి చెందిన సిక్కులు నిరసనలు తెలిపారు.
"నో ఫార్మర్స్, నో ఫుడ్", "సేవ్ ది ఫార్మర్స్" అనే నినాదాలతో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు.
'శాంతియుత నిరసనలతో భారత ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపుతామని, రైతులకు మద్దతు తెలపాల్సిన బాధ్యత మనందరిదని' అమన్‌దీప్ సింగ్ హుండాల్ తెలిపారు.
జకారా ఉద్యమనాయకుల సంఘీభావం
అమెరికాలోని తీరప్రాంతాల్లో ఆదివారం నిరసనలు నిర్వహించనున్నారు. జకారా ఉద్యమ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 'పంజాబ్‌లో తరతరాల నుంచి వ్యవసాయం జీవనోపాధిగా ఉంటోంది. వ్యవసాయం లేకపోతే పంజాబ్‌లో లక్షల మందికి ఉపాధి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపాల'ని జకారా ఉద్యమ నాయకులు తెలిపారు.
" ఈ(రైతుల నిరసనలు) ఘటనలతో మేం తీవ్రమైన కలత చెందాం. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మేం మద్దతు ఇస్తున్నాం."
--నైనాదీప్ సింగ్, జకారా ఉద్యమ అధ్యక్షుడు.
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్, హరియాణాకు చెందిన వేల మంది రైతులు 11 రోజులుగా దేశ రాజధాని దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమని అభివర్ణించారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, వారికి అనేక అవకాశాలను కల్పిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.